కొవిడ్​-19 వ్యాక్సిన్​ ఆగస్టు 15 లోపు కష్టమే!

భారత్​లో కొవిడ్​-19 వ్యాక్సిన్​ అభివృద్ధి చేస్తోన్న సంస్థలు కఠినమైన నిబంధనలన్నింటినీ అనుసరించే ట్రయల్స్​ పూర్తి చేస్తాయని తెలిపారు ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కే.విజయరాఘవన్​. అందులో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. రాఘవన్ వ్యాఖ్యలు ఐసీఎంఆర్​- భారత్​ బయోటెక్ అభివృద్ధి చేసిన​ కోవాగ్జిన్​ వ్యాక్సిన్.. ఆగస్టు 15లోగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని సూచిస్తున్నాయి.

వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్​లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు విజయ రాఘవన్​.

” ఏ వ్యాక్సిన్​కైనా మనుషులపై క్లినికల్​ ట్రయల్స్​ తొలి దశ సాధారణంగా 28 రోజులు పడుతుంది. అది పూర్తయిన తర్వాతే మిగతా దశలను ప్రారంభిస్తారు. ఇప్పటికే భారత్​ బయోటెక్​ వ్యాక్సిన్​, జైడస్​ కాడిలా వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​కు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చింది. కాబట్టి ఈ రెండు సంస్థల వ్యాక్సిన్లు కఠినమైన ప్రక్రియలను ఎదుర్కొని ట్రయల్స్​ను పూర్తి చేస్తాయి. అందులో ఎలాంటి రాజీ లేదు. ఒకవేళ తక్షణమే వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చినా.. తీవ్రంగా అనారోగ్యానికి గురైన వారికి ప్రాధాన్యం ఇవ్వటం వల్ల అది అందరికి అందేసరికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పడుతుంది.”

– కే. విజయ్​ రాఘవన్​, ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు​

ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌- ఐసీఎంఆర్ భాగస్వామ్యంలో కోవాగ్జిన్‌ పేరుతో వైరస్‌కు వ్యాక్సిన్‌ రూపకల్పన జరుగుతోంది. ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15లోపు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కొన్ని రోజుల ముందు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఈ అంశమై స్పందించిన రాఘవన్ జులై 10న క్లినికల్​ ట్రయల్స్​ తొలి దశ ప్రారంభమైందని.. అలాగే మిగతా 12 కేంద్రాల్లో ఒకేసారి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సాధారణంగా ఇంత తక్కువ సమయంలో అందుబాటులోకి రాదని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This