ఆందోళన వీడుదాం.. అవగాహన పెంచుకుందాం.. కొవిడ్​ను తరిమికొడదాం!

కొవిడ్‌ విస్తృతంగా, వేగంగా వ్యాప్తి చెందుతోంది. లాక్‌డౌన్‌ సడలింపులు, ప్రజల రాకపోకలు, వ్యాపార లావాదేవీలు మొదలవగా.. గత నెల రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇళ్లూ, కార్యాలయాలు, మార్కెట్లూ.. ఒక్కచోటని కాదు ఎక్కడ్నించి ఎవరి ద్వారా వైరస్‌ ముప్పు పొంచి ఉందోనన్న భయాందోళనలు వెన్నాడుతున్నాయి. దీంతో వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొంటూ జీవనాన్ని కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి కరోనా పాజిటివ్‌ వస్తే భయపడాల్సిన పనిలేదు. ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన అవసరమూ లేదు. అవగాహనతో ధైర్యంగా ఉంటే కరోనాను సగం జయించినట్లే. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాల ప్రకారం.. ఎటువంటి లక్షణాలు లేని పాజిటివ్‌లు, స్వల్ప లక్షణాలున్నవారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందవచ్చు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో వేల మంది ఇంట్లో ఉండి కోలుకున్నారు. కోలుకుంటున్నారు. అయినా కొన్ని ప్రశ్నలు మనల్ని నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి.

కొవిడ్‌ అనేది ఒక వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌. దీని జీవితకాలం వారం, రెండు వారాలే. ఆ తర్వాత క్రమేణా శరీరంలో దాని ప్రభావం తగ్గిపోతుంది. వైరస్‌ సోకినవారిలో 85 శాతం మందిలో ఎటువంటి ప్రమాదం ఉండదు. కరోనా సోకినా.. వారిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఆ వ్యక్తికి తెలియకుండానే వైరస్‌ సోకి తగ్గిపోవచ్చు కూడా. కొంత కాలం తర్వాత శరీరంలో యాంటీబాడీస్‌ వృద్ధి చెందుతాయి. కేవలం 15 శాతం మందిలోనే లక్షణాలు కనిపించడం, కొంత తీవ్రత పెరగడం వంటివి చూస్తున్నాం. ఇందులోనూ కేవలం 5 శాతం మందికి మాత్రమే ఐసీయూలో చికిత్స అందించాల్సి వస్తోంది. అందుకే అవగాహనతో ధైర్యంగా ఉంటే సగం కరోనాని జయించినట్లే. కొవిడ్‌ కొత్త జబ్బు కాబట్టి దీని గురించి శాస్త్రపరమైన అవగాహన కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This