తెలంగాణలో కరోనా ఉద్ధృతి… 20 వేలు దాటిన కేసులు

కొవిడ్‌ రక్కసి ధాటికి తెలంగాణ విలవిల్లాడుతోంది. నిత్యం వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఏ రోజుకారోజూ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. శుక్రవారం ఏకంగా 1,892 మందికి వైరస్‌ సోకడం…. పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే అత్యధికంగా 1,658 కేసులు రావడం కలకలం రేపుతోంది.

20 వేలు దాటిన భాదితుల సంఖ్య..

శుక్రవారం నమోదైన 1,892 కేసులతో… తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య 20 వేలు దాటింది. మొత్తం 20 వేల 462 మంది కరోనా కోరలకు చిక్కారు. కేవలం మూడు రోజుల్లోనే 4,123 మంది వైరస్‌ బారిన పడటం…. కరోనా విజృంభణకు నిదర్శంగా నిలుస్తోంది. శుక్రవారం 5,965 పరీక్షలు చేశారు. తెలంగాణలో నిర్వహించిన మొత్తం కొవిడ్ టెస్టుల సంఖ్య లక్షా 4 వేల 118కి చేరింది. శుక్రవారం మరో 8మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ వల్ల చనిపోయినవారి సంఖ్య 283కి చేరింది.

జీహెచ్​ఎంసీ పరిధిలోనే ఎక్కువ..

కరోనా తీవ్రత హైదరాబాద్‌ చుట్టు పక్కలే ఎక్కువగా ఉంది. శుక్రవారం రికార్డు స్థాయిలో 1,658 మంది వైరస్‌ బారిన పడ్డారు. తెలంగాణలో నమోదైన 20వేలకుపైగా కేసుల్లో…. 16 వేల మంది బాధితులు జీహెచ్​ఎంసీ పరిధిలోనే ఉన్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్‌ జిల్లాలో 44 కేసులు వెలుగు చూశాయి. జీహెచ్​ఎంసీ కేసులకు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలను కలిపితే వైరస్‌ బాధితుల సంఖ్య 18వేలకు చేరుతోంది. విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తుండటం వల్ల భారీగా పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This