గుడ్​న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవాగ్జిన్​!

కరోనా వైరస్​కు భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్​​ను ఆగస్టు 15 కల్లా విడుదల చేయాలని ఐసీఎంఆర్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి పరీక్షలను వేగవంతం చేయాలని భారత్​ బయోటెక్​తోపాటు సంబంధిత వైద్య కళాశాలకు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ లేఖ రాశారు.

ఇందుకోసం భారత్ బయోటెక్​తో కలిసి పనిచేయనున్నట్టు బలరాం పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యాక్సిన్ విడుదల ప్రాథమిక అంశంగా పరిగణించాలని, ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని వ్యాక్సిన్ తయారీలో భాగస్వాములందరికీ తెలియజేశారు బలరాం.

సన్నద్ధమవ్వాలి..

భారత్​ బయోటెక్​తో పాటు ఎంపిక చేసిన కేంద్రాలు క్లినికల్ ట్రయల్స్​కు సన్నద్ధమవ్వాలని సూచించారు భార్గవ. త్వరితగతిన ట్రయల్స్​ను పూర్తి చేసి, ఫలితాల వివరాలను అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఈ వ్యాక్సిన్​ కరోనాను నివారించగలిగితే ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి త్వరగా తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.

ఐసీఎంఆర్, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ సహకారంతో కరోనా వైరస్ వ్యాక్సిన్​ను భారత్​ బయోటెక్ అభివృద్ధి చేసింది. కోవాగ్జిన్​​కు డ్రగ్​ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతితో క్లినికల్ ట్రయల్స్​ను జులై నెలలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది భారత్ బయోటెక్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This