రెమిడెసివిర్ ఔషధం‌ మొత్తం అమెరికాకే..!

యాంటీ వైరల్‌ ఔషధం రెమిడెసివిర్‌కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న గిలిద్ సైన్సెస్‌ స్టాక్‌నంతా అమెరికా కొనుగోలు చేసింది. ఆ విషయాన్ని యూఎస్‌ ఆరోగ్య, మానవ సేవల విభాగం(హెచ్‌హెచ్‌ఎస్‌) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఏకైక తయారీ సంస్థ గిలిద్ సైన్సెస్‌ నుంచి 5 లక్షల డోసులను తమ దేశం కొనుగోలు చేసిందని దానిలో పేర్కొంది. కొవిడ్-19 బాధితులకు ఉపశమనం కలిగిస్తుందని భావించడంతో చాలా దేశాలు దీనిపై ఆశలు పెట్టుకున్నాయి.

‘కొవిడ్-19 చికిత్స నిమిత్తం అనుమతి పొందిన ఔషధాన్ని అమెరికన్లకు అందుబాటులో ఉంచడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అద్భుతమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సాధ్యమైనంత వరకు అవసరమైన ప్రతి అమెరికన్‌ బాధితుడు రెమిడెసివిర్ పొందేలా చూడాలనుకుంటున్నాం. కొవిడ్-19 చికిత్సా విధానాలు తెలుసుకోడానికి, వాటిని అందించడానికి ట్రంప్‌ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది’ అని హెచ్‌హెచ్‌ఎస్‌ కార్యదర్శి అలెక్స్‌ అజార్ వెల్లడించారు. జులై నెలలో 100 శాతం, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో 90 శాతం ఉత్పత్తి కానున్న ఔషధాన్ని కొనుగోలు చేసినట్లు ఆ ప్రకటనను బట్టి తెలుస్తోంది. క్లినికల్ ట్రయల్స్ కోసం కొంత కేటాయించినట్లు తెలిపింది. అయితే ఈ ప్రకటనపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొవిడ్-19 చికిత్సలో పురోగతి చూపుతున్నట్లు భావిస్తున్న రెండు ఔషధాల్లో రెమిడెసివిర్‌ ఒకటి. దీని వాడకం వల్ల బాధితులు త్వరగా కోలుకుంటున్నట్లు వెల్లడైంది. దాంతో దీని వినియోగానికి గతంలోనే అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అత్యవసర అనుమతి ఇచ్చింది. కాగా, దాన్ని గతంలో ఎబోలా వైరస్‌ కట్టడికి వాడారు. భారత్‌లో హెటిరో, సిప్లా కంపెనీలు రెమిడెసివిర్‌ను ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరికొన్ని కంపెనీలు కూడా దీనిని తయారు చేయడానికి లైసెన్స్‌లు పొందినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This