34 కోట్ల ఉద్యోగాలకు ‘కరోనా’ ఎసరు!

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వైరస్‌ ఉద్ధృతి ఇదే స్థాయిలో కొనసాగితే.. 2020 ద్వితీయార్థంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34 కోట్ల మంది పూర్తిస్థాయి ఉద్యోగాలు కోల్పోనున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) పేర్కొంది. 2020 రెండో త్రైమాసిక ఫలితాలను ఐఎల్‌వో విడుదల చేసింది. రెండో త్రైమాసికంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారని పేర్కొంది. అంచనాలను మించిన విధ్వంసం కొనసాగుతుందని చెప్పింది. కరోనా మునుపటి పరిస్థితులు ఇప్పుడప్పుడే రావడం కష్టమేనని ఐఎల్‌వో తన నివేదికలో తెలిపింది. వచ్చే ఆరునెలల్లో పరిస్థితులు మెరుగయ్యే సూచనలు కనబడడం లేదని పేర్కొంది. ఈ మహమ్మారి కారణంగా.. మహిళా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని.. వారి పనిగంటలు బాగా తక్కువైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

బ్రిటన్‌లో భారీ కోతలు

బ్రిటన్‌లోని సంస్థలు భారీగా ఉద్యోగాలకు కోతలు పెడుతున్నాయి. పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఈ తీవ్రత ఎక్కువగా కనబడుతోంది. బ్రిటన్‌ సహా చాలా దేశాల్లో కాఫీ షాపులు నిర్వహించే ‘అప్పర్‌ క్రస్ట్’​ ఐదు వేలమందికి ఉద్వాసన పలుకుతున్నట్లు బుధవారం ప్రకటించింది. 15 వేల ఉద్యోగాలకు కోత పెడుతున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్‌ బస్‌ ప్రకటించిన మరుసటి రోజే అప్పర్‌ క్రస్ట్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆతిథ్య పర్యాటక రంగాల్లోని చాలా సంస్థలు త్వరలో ఇదే బాట పట్టనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పోతుంటే.. అమెరికా ఇందుకు భిన్నమైన డేటాను విడుదల చేసింది. జూన్‌ నెలలో అమెరికా సంస్థలు 24 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు ఓ ప్రైవేటు సర్వే పేర్కొంది. ఇందులో చిన్న సంస్థల్లోనే దాదాపు తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు దక్కాయని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This