కుదుటపడ్డ ధారావి.. తగ్గిన వైరస్​ వ్యాప్తి

ధారావి.. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ. భారత ఆర్థిక రాజధాని ముంబయిలో జనం కిక్కిరిసి ఉండే ఈ ప్రాంతం కొవిడ్‌ ఉద్ధృతితో ఇటీవల గజగజలాడింది. ప్రతిరోజు వందల్లో కేసులు బయటపడటం వల్ల వణికిపోయింది. అయితే- బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికార యంత్రాంగం సంకల్ప బలంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మెరుగుపడ్డాయి. వైరస్‌ వ్యాప్తికి దాదాపుగా కళ్లెం పడింది. తొలినాళ్లలో 12 శాతంగా ఉన్న రోజువారీ కేసుల వృద్ధిరేటు ఇప్పుడు 1.02 శాతానికి తగ్గింది.

ధారావిలో చదరపు కిలోమీటరుకు 2.27 లక్షల మంది చొప్పున జనాభా ఉంటుంది. 80శాతం ప్రజలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి సామాజిక మరుగుదొడ్లపైనే ఆధారపడుతుంటారు. అవే వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఇక ప్రతి పది మందిలో 8 మందికి 10×10 అడుగుల విస్తీర్ణంలో ఉండే పాకలే దిక్కు. ఆ ప్రాంతమంతటా ఇరుకు సందులే. 2-3 అంతస్థుల భవనాలు ఉన్నా, వాటిలో కింది అంతస్థుల్లో జనం నివాసముంటారు.. పై అంతస్థుల్లో ఫ్యాక్టరీలు నడుస్తుంటాయి. దీంతో అక్కడ భౌతిక దూరాన్ని పాటించడం దాదాపు అసంభవం! ఏప్రిల్‌ వరకు ధారావిలో 491 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ వ్యాప్తి వ్యాప్తి ఊపందుకోవడంతో అందరిలోనూ ఆందోళన చెలరేగింది.

ప్రైవేటు వైద్యులనూ రంగంలోకి దింపి..

వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో బీఎంసీ యంత్రాంగం అప్రమత్తమయింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో వైద్యరంగంలో మానవ వనరులను సమీకరించింది. ప్రైవేటు ప్రాక్టిషనర్లనూ క్షేత్రస్థాయికి తరలించింది. వారికి పీపీఈ కిట్లు, థర్మల్‌ స్కానర్లు, పల్స్‌ ఆక్సీమీటర్లు, మాస్కులు, చేతి తొడుగులు సమకూర్చి.. ట్రేసింగ్‌, ట్రాకింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌ అనే ‘4టీ’ విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు చేతులు కలిపి ఇంటింటి సర్వే చేశారు. 5,48,270 మందిని స్క్రీన్‌ చేసి అనుమానితులను కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. అదే సమయంలో ముంబయివ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. వాటిలోనే ధారావి సహా పలు ప్రాంతాల పేదలకు వైద్యం అందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This