దేశంలో ఆరుగురికి కొత్త రకం వైరస్​- తెలంగాణలో ఇద్దరికి

భారత్‌లో కొత్త రకం వైరస్ స్ట్రెయిన్​- ఆరుగురికి నిర్ధరణ‌

బ్రిటన్‌లో వెలుగుచూసి ప్రపంచ దేశాలను భయపెడుతోన్న కరోనా ‘కొత్త రకం’ వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించింది. దేశంలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఇటీవల యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో కొత్తగా మార్పు చెందిన కరోనా వైరస్‌ ఉన్నట్లు తాజాగా తేలింది. బెంగళూరులోని నింహన్స్‌లో మూడు, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో రెండు, పుణెలోని ఎన్‌ఐవీలో ఒక కేసు నిర్ధరణ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం అధికారంగా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఆరుగురిని ఆయా రాష్ట్రాల్లో సింగిల్‌ రూం ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది.

యూకేలో కొత్త రకం వైరస్‌ ఆందోళనకరంగా మారిన సమయంలో భారత్‌లో ఈ కేసులు వెలుగుచూడటం కలవరపెడుతోంది. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్తరకం విజృంభిస్తోంది. అక్కడ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త రకం వైరస్‌ 70శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటం వల్ల ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే భారత్‌ సహా పలు దేశాలు యూకేకు విమానసర్వీసులు నిలిపివేశాయి.

భారత్‌లో ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి 31 వరకు బ్రిటన్‌కు విమానాల రాకపోకలను నిలిపివేశారు. నవంబర్​ 25 నుంచి డిసెంబర్​ 23 అర్ధరాత్రిలోగా భారత్‌కు చేరుకున్న 33 వేలమంది ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 114 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. బాధితులకు సోకింది కొత్త రకమా? కాదా? అన్నది తెలుసుకునేందుకు వారి రక్తనమూనాలను వైరాలజీ ల్యాబ్‌లకు పంపించారు. తాజాగా ఈ ఫలితాలు వెలువడగా.. యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో కొత్త రకం వైరస్‌లను గుర్తించినట్లు తేలింది.

ఇప్పటివరకు డెన్​మార్క్​, నెదర్లాండ్స్​, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్​, ఫ్రాన్స్​, స్పెయిన్, స్విట్జర్​లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్ దేశాల్లో ఈ కొత్త రకం వైరస్​ కేసులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This