బైబై2020: కరోనా కాలంలోనూ కథానాయికల జోరు!

ఏడాది పూర్తవుతోందంటే చాలు.. ఎన్ని సినిమాలు చేశాం? ఎన్ని విజయాలొచ్చాయి? అనే పద్దులు మొదలవుతుంటాయి. ఈసారి పరిస్థితి అందుకు భిన్నం. సినిమా విడుదలైందన్న మాట చాలు.. అదే విజయంతో సమానంగా స్వీకరించారు సినీ తారలు. కరోనాతో ఏర్పడిన పరిస్థితులు అలాంటివి. చిత్రసీమ స్తంభించిపోవడం వల్ల చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. చేసిన సినిమాలు విడుదల కాక.. చిత్రీకరణలకు వెళ్లే పరిస్థితులు లేక తారలు ఇంటి దగ్గరే గడిపారు. కరోనాతో గడిచిపోయిన ఈ ఏడాదిలో కొద్దిమంది కథానాయికలు మాత్రం చిత్రాల్ని విడుదల చేసుకున్నారు. విజయాల్నీ అందుకున్నారు.

సంఖ్య విషయంలో కథా నాయకులకు పరిమితులు ఉంటాయి. కథంతా వాళ్ల చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఎక్కువ కాల్షీట్లు కేటాయించాల్సి రావడం, బడ్జెట్టు, భారీ తారాగణం, చిత్రీకరణల్లో అనుకోని అవాంతరాలు.. తదితర కారణాలతో ఏడాదికి ఒకట్రెండు సినిమాలు మించి చేయడం సాధ్యపడదు. కుర్ర హీరోల్లో ఒకరిద్దరే మూడు నాలుగు సినిమాలు చేసేస్తుంటారు. అగ్ర కథానాయకుల్లో సింహ భాగం ఏడాదికి ఒక సినిమాతోనే సరిపెట్టేస్తుంటారు. నాయికల విషయంలో పరిస్థితి ఇందుకు భిన్నం. అవకాశాలు వస్తున్నకొద్దీ వాళ్లు పచ్చజెండా ఊపేస్తుంటారు. ఒకొక్కరు నాలుగైదు సినిమాలు అలవోకగా చేసేస్తుంటారు. ఒక భాషకు పరిమితం కాకుండా.. రెండు మూడు పరిశ్రమలు చుట్టేస్తుంటారు. మన నాయికలు 2020ను అలాంటి ప్రణాళికలతో ఆరంభించారు. వారిలో చాలామందే తమ సినిమాల్ని తెరపై చూసుకున్నారు. కరోనాతో కొద్దిమంది భామలు తెలుగులో ఖాతా తెరవలేకపోయారు.

సంక్రాంతి భామలు

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి విజయాల్ని అందుకున్న భామలు.. పూజా హెగ్డే, రష్మిక. ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో బుట్టబొమ్మగా పూజా హెగ్డే ఆకట్టుకుంటే.. ‘సరిలేరు నీకెవ్వరు’తో నీకు అర్థమవుతుందా? అంటూ ముద్దు ముద్దుగా మురిపించింది రష్మిక. ఆరంభంలోనే ఈ కథానాయికలిద్దరూ తమ పాత్రలతో సందడి చేసిన విధానం అలరించింది. కొద్దిమంది కథానాయికలు డబుల్‌ బొనాంజా కొట్టారు. అందులో రష్మిక ఒకరు. ఆమె నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరిలో విడుదల కాగా, ఫిబ్రవరిలో ‘భీష్మ’ విడుదలైంది. ఈ రెండూ ఆమెకు విజయాల్ని అందించాయి. కీర్తిసురేష్‌, మెహరీన్‌, నభా నటేష్‌ తదితర నాయికలూ రెండేసి సినిమాలతో అలరించారు. మెహరీన్‌ ‘ఎంతమంచి వాడవురా’, ‘అశ్వత్థామ’ చిత్రాలతో సందడి చేశారు. నభా నటేష్‌ ‘డిస్కోరాజా’తో పాటు ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమాతో రెండోసారి మురిపించారు. కీర్తిసురేష్‌ నటించిన ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’ సినిమాలు ఓటీటీ వేదికలకే పరిమితం అయ్యాయి. వర్ష బొల్లమ్మ..’మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌’, ‘చూసీ చూడంగానే’ చిత్రాలతోనూ, ‘హిట్‌’, ‘డర్టీ హరి’ చిత్రాలతో రుహానీ శర్మ ప్రేక్షకుల ముందుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This