మోడెర్నా యాంటీబాడీల జీవితకాలం 3 నెలలు

కరోనా వైరస్‌ను అరికట్టడంలో 94 శాతం సమర్థత చూపిన మోడెర్నా టీకాతో కనీసం మూడు నెలల పాటు ఉండే ప్రతిరక్షకాలు(యాంటీబాడీలు) ఉత్పత్తి అవుతాయని ఓ అధ్యయనం తెలిపింది. ఈ టీకా అభివృద్ధిలో పాల్గొన్న ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అలర్జీస్‌ అండ్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌'(ఎన్‌ఐఏఐడీ) టీకా తీసుకున్న 34 మందిపై అధ్యయనం జరిపింది. ఈ 34 మందిలో యువకుల నుంచి వృద్ధుల వరకు ఉన్నారు. వీరంతా మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో టీకా తీసుకున్నారు.

ఈ మేరకు వారి అధ్యయనానికి సంబంధించిన వివరాల్ని ‘న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో ప్రచురించారు. సార్స్‌-కొవ్‌-2 వైరస్‌పై పోరాడే ప్రతిరక్షకాలు ఊహించినట్లుగానే కాలం గడుస్తున్న కొద్దీ తగ్గిపోయినట్లు గమనించామని స్పష్టం చేశారు. అయితే, టీకా తీసుకున్న దాదాపు అందరిలో కనీసం మూడు నెలల వరకు యాంటీబాడీలు క్రియాశీలకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎంఆర్‌ఎన్‌ఏ-1273 పేరిట తయారు చేసిన ఈ టీకాను 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల చొప్పున ఇచ్చారు.

ఆందోళన అవసరం లేదు.. ఫౌచీ

యాంటీబాడీలు కనుమరుగైపోవడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ తెలిపారు. మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో ప్రతిరక్షకాల తాలూకూ సమాచారం నిక్షిప్తమై ఉంటుందన్నారు. టీకా ద్వారా ఉత్పత్తయ్యే యాంటీబాడీల సమాచారాన్ని గుర్తుంచుకునే రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని కణాలు స్పందించడం అధ్యయనంలో గుర్తించామని పరిశోధకులు తెలిపారు. తర్వాతి కాలంలో మరెప్పుడైనా కరోనా సోకినా వెంటనే యాంటీబాడీలు ఉత్పత్తవుతాయని వివరించారు. అయితే, ఈ ప్రక్రియపై మరింత లోతైన అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందన్నారు.

అత్యవసర వినియోగం కోసం తమ టీకాను అనుమతించాలంటూ ఇప్పటికే అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థకు మోడెర్నా దరఖాస్తు చేసుకుంది. దీనిపై డిసెంబరు 17న నిర్ణయం వెలువడనుంది. మరోవైపు ఫైజర్‌ అభివృద్ధి చేసిన టీకాకు సైతం అనుమతులు రావాల్సి ఉంది. బ్రిటన్‌లో ఇప్పటికే ఈ టీకాకు అనుమతి లభించగా.. వచ్చే వారం నుంచి ప్రజలకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This