ఆంధ్రప్రదేశ్​లో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో ఆయన విజయవాడలో హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. సోమవారం, మంగళవారం రెండ్రోజులూ ఆయన శాసనసభకు హాజరయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో బుధవారం అసెంబ్లీ లాబీల్లో అంతా అదే చర్చ సాగింది. ఆ రెండ్రోజులూ ఆయనతో ఎవరెవరు మాట్లాడారు? సభలో ఆయన పక్కన ఎవరు కూర్చున్నారు? ఎవరెవరు ఆయనతో కాంటాక్ట్‌ అయ్యారంటూ పలువురు ఆరా తీశారు. అసెంబ్లీ బుధవారం యథావిధిగా కొనసాగడంతో శానిటైజేషన్‌పై పలువురు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ విధుల్లో ఉన్న కొందరు ఉద్యోగులు, సిబ్బంది మధ్య చర్చ సాగింది. అయితే ఉదయాన్నే శానిటైజ్‌ చేశామని అసెంబ్లీ అధికారులు తెలిపారు.

‘కరోనా-ఆరోగ్యశ్రీ’పై నేడు శాసనసభలో చర్చ

శాసనసభలో గురువారం కరోనా-ప్రభుత్వం తీసుకున్న నియంత్రణ చర్యలు, ఆరోగ్యశ్రీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ)పై స్వల్పకాలిక చర్చలు నిర్వహించనున్నారు. అలాగే ‘ల్యాండ్‌ టైటిలింగ్‌, దిశ, పురపాలక చట్టాల్లో రెండో సవరణ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్ట సవరణ’ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనమండలిలో ‘ఉద్యోగుల సంక్షేమం-ప్రభుత్వ విధానం’, శాంతి భద్రతలు, పోలవరం నిర్మాణంపై స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు. అలాగే శాసనసభలో ఆమోదం పొందిన 9 బిల్లులను మండలి ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This