బీఈ కరోనా టీకాపై త్వరలో మూడో దశ పరీక్షలు

హైదరాబాద్‌కు చెందిన టీకాల తయారీ సంస్థ బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌ (బీఈ) అభివృద్ధి చేస్తున్న ‘కరోనా’ టీకాపై వచ్చే ఏడాది జనవరి తర్వాత మూడో దశ క్లినికల్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అమెరికాకు చెందిన బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌, డైనావాక్స్‌ టెక్నాలజీస్‌తో కలిసి కరోనా టీకాను బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ అభివృద్ధి చేస్తున్న సంగతి విదితమే. దీనిపై మొదటి- రెండో దశ క్లినికల్‌ పరీక్షలు ఇటీవల ప్రారంభం అయ్యాయి. ఈ ఫలితాలు జనవరి నెలాఖరు నాటికి వెల్లడవుతాయి. తదనంతరం నేరుగా మూడో దశ క్లినికల్‌ పరీక్షలు ప్రారంభించే అవకాశం ఉందని బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల తెలిపారు. సోమవారం యార్లగడ్డ శ్రీరాములు 17వ స్మారక ఉపన్యాసంలో ‘కొవిడ్‌-19 వ్యాక్సిన్‌- అభివృద్ధి, సవాళ్లు’ అంశంపై ఆమె మాట్లాడారు.

30వేల మందిపై మూడో దశ పరీక్షలు..

మూడో దశ క్లినికల్‌ పరీక్షలను దాదాపు 30,000 మంది వలంటీర్లపై నిర్వహిస్తామని తెలిపారు మహిమా దాట్ల. వచ్చే ఏడాది జూన్‌- జులై నాటికి ఈ పరీక్షల పలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. ఇదేకాకుండా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తోనూ తమకు టీకా తయారీ ఒప్పందం ఉందని, ఆ కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా టీకాపై ఇప్పుడు మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 45 టీకాలు క్లినికల్‌ పరీక్షల దశకు చేరాయి. ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్ర జెనేకా టీకా 70 శాతానికి పైగా సమర్థతను నమోదు చేసిందని ఉదహరించారు. ‘ఈ పరిణామాలను చూస్తుంటే, కరోనా టీకా తీసుకురాగలం అనే నమ్మకం కలుగుతోంది. పది రోజుల క్రితం వరకు ఇటువంటి పరిస్థితి లేదు’ అన్నారామె.

టీకా తీసుకున్న వారిలో దాని ప్రభావం ఎన్నాళ్లు ఉంటుంది, ఏఏ వయస్కుల వారిపై ఎలా పనిచేస్తోంది.. అనేది నిర్థారణ కావాల్సి ఉందన్నారు. టీకా పంపిణీ ఎంతో కష్టమైన పనిగా విశ్లేషించారు. ఉదాహరణకు ఫైజర్‌ తయారు చేసిన టీకాను -70 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి.. అధికశాతం దేశాల్లో అటువంటి సదుపాయాలు లేవని వివరించారు. తయారీ సామర్థ్యాన్ని సమకూర్చుకోవడం కూడా సవాలేనని పేర్కొన్నారు. ప్రపంచ జనాభా మొత్తానికి 1600 కోట్ల డోసుల టీకా కావాలి, కానీ ఇప్పుడున్న తయారీ సామర్థ్యం 800 కోట్ల డోసులు మాత్రమేనని తెలిపారు. ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ రావాలంటే జనాభాలో 70 శాతం మందికి అయినా టీకా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. టీకా తయారీ సామర్థ్యం మనదేశంలో ఎంతో అధికంగా ఉండటం ఒక సానుకూలతగా చెబుతూ, ఏటా యునిసెఫ్‌ అవసరాల్లో 70 శాతం వరకు టీకాలను మనదేశమే సరఫరా చేస్తోందని వివరించారు.

మాలక్ష్మీ గ్రూపు వ్యవస్థాపకుడు వై. హరీష్‌చంద్ర ప్రసాద్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌- ఆంధ్రప్రదేశ్‌ విభాగం ఛైర్మన్‌ డాక్టర్‌ కె.హేమచంద్రా రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This