‘యాంటీవైరల్​ పొర’ మాస్కులతో కరోనాకు చెక్​!

కరోనా వైరస్​ను తుదముట్టించే యాంటీవైరల్​ పొర కలిగిన ఒక కొత్త మాస్కును డిజైన్​ చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. దీన్ని ధరించిన వారి ద్వారా ఇన్​ఫెక్షన్​ వ్యాప్తికి అవకాశాలు బాగా తగ్గిపోతాయి. నార్త్​వెస్ట్రన్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు.

కరోనా మహమ్మారిపై పోరుకోసం ఉపయోగిస్తున్న వ్యక్తిగత రక్షణ ఉపకరణాల్లో(పీపీఈ) మాస్కులు చాలా ముఖ్యమైనవి. వీటిని ధరించిన వారిని రక్షించడమే కాకుండా.. సదరు వ్యక్తి నుంచి వెలువడే తుంపర్ల బారి నుంచి ఇతరులనూ అవి కాపాడతాయి. ఆ తుంపర్లను అడ్డుకోవడం లేదా దారి మళ్లించడం వంటివి చేస్తాయి. అయినా కొన్ని బయటకు వస్తూనే ఉంటాయి. అవి నేరుగా ఇతరులకు ఇన్​ఫెక్షన్​ కలిగించొచ్చు. లేదంటే.. ఉపరితలాలపై పడి, పరోక్షంగానూ వైరస్​ను వ్యాప్తి చేయవచ్చు.

ఆ రసాయనాల పూతతో వైరస్​ ఫట్​..

ఈ నేపథ్యంలో మాస్కుల నుంచి తప్పించుకొనే తుంపర్లను శుద్ధి చేసి, వాటిలోని వైరస్​లను వేగంగా నిర్వీర్యం చేయాలని శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం అనేక ప్రయోగాలు నిర్వహించాక.. పాస్ఫారిక్​ ఆమ్లం, కాపర్​ లవణాన్ని ఎంచుకున్నారు. ఈ రెండు రసాయనాలకు ఆవిరయ్యే లక్షణం లేదు. అందువల్ల శ్వాసలోకి ఇవి ప్రవేశించే అవకాశం లేదు. వీటిని మాస్కులపై పూసినప్పుడు.. వైరస్​లకు ప్రతికూలమైన పరిస్థితులను సృష్టిస్తున్నాయని తేల్చారు పరిశోధకులు. ”వైరస్​ నిర్మాణాలు చాలా సున్నితమైనవి. ఏదైనా భాగంలో లోపం తలెత్తితే.. ఇన్​ఫెక్షన్​ను వ్యాప్తి చేసే సామర్థ్యం వాటికి తగ్గిపోతుంది.” అని పరిశోధనకు నాయకత్వం వహించిన జియాక్షింగ్​ హువాంగ్​ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This