వైరస్ సోకింది.. వెళ్లి పోయింది.. కానీ ఈ విషయం వారికి తెలీదు!

రాష్ట్రంలో 4 జిల్లాల్లో జరిగిన సిరో సర్వైలెన్స్ ఫలితాలపై విశ్లేషణ జరుగుతోంది. నాలుగు జిల్లాల్లో ఎంపిక చేసిన వ్యక్తుల్లో 3,750 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. పట్టణాలు/ నగరాల్లో 30 % , గ్రామీణ ప్రాంతాల్లో 70 % చొప్పున ఈ నమూనాలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే నమోదైన కేసులు, వయసు, పురుషులు, మహిళల కేటగిరి, ఇతర ప్రమాణాల ప్రకారం ఇప్పటివరకు వైరస్ సోకని వారి నుంచి మాత్రమే ఈ సేకరణ జరిగింది. వీరి రక్త నమూనాలను క్లియా మిషన్ల ద్వారా పరీక్షించారు. దీని ప్రకారం కృష్ణా జిల్లాలో సుమారు 20 % మంది వైరస్ సోకి …. వెళ్లిపోయినట్లు తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలో 15 %, నెల్లూరు జిల్లాలో 9 % , అనంతపురం జిల్లాలో 12 % నుంచి 14 % మందికి వైరస్ సోకింది. వీరెవరికీ వైరస్ వచ్చి వెళ్లినట్లు తెలియదు. ఈ ఫలితాలను శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషిస్తున్నారు .

కృష్ణా జిల్లాలో నమోదవుతోన్న కేసులకు తగ్గట్లుగానే ‘సిరో సర్వైలెన్స్’ ఫలితాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు . నమూనాల సేకరణ జరిగిన ప్రాంతాల వారీగా పరిశీలిస్తే .. ఒక్కొక్కచోట 20 % కంటే ఎక్కువ మందికి వైరస్ సోకి , వెళ్లినట్లు గుర్తించారు. వీరితోపాటు వైరస్ నిర్ధారణ పరీక్షల ద్వారా పాజిటివ్ గా తేలిన వారిని మినహాయిస్తే.. మిగిలిన వారిలోనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించాలి. దీని ప్రకారం కృష్ణా జిల్లాలో వైరస్ సంక్రమణ తక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఫలితాల విశ్లేషణ పూర్తయిన అనంతరం మిగిలిన జిల్లాల్లో ప్రారంభించాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This