విజయవాడలో.. పాత సంస్కృతి పడగవిప్పుతోందా?!

ఆంధ్రప్రదేశ్​ విజయవాడలో యువత పెడదోవ పడుతోంది. తాజాగా రోడ్డుపై దాడులు చేసుకున్న ఘటనలో సుమారు 30 మంది పాల్గొంటే.. అందులో ఎక్కువ మంది 27 ఏళ్ల లోపువారే. ప్రధాన నిందితులు మినహా .. మిగతా వారిలో ఎవరికీ నేరచరిత్ర లేదు. సినిమాల ప్రభావమో.. పరిస్థితుల ప్రభావమో గానీ యువతకు మాదకద్రవ్యాలు, గంజాయి ఎరగా వేయడం.. చదువుకునే వారికి ఆర్థిక , ప్రేమ వ్యవహారాల్లో సాయం చేస్తూ.. గ్యాంగ్‌లను నడుపుతున్న నయా సంస్కృతి.. బెజవాడలో మొదలైంది. నగరంలోని పలు ఖాళీ స్థలాలు, నిర్జన ప్రదేశాలు, క్రీడామైదానాల్లో కొందరు యువత మద్యం సేవిస్తూ… అర్ధరాత్రి వరకూ అక్కడే కాలక్షేపం చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో.. భూ దందాలు, సెటిల్మెంట్లు బాగా పెరిగాయి. అల్లరి మూకలు, రౌడీషీటర్లు, కత్తులతో ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో… దాడులకు తెగబడుతున్నారు. కొన్ని కాలనీల్లోనూ చిన్నచిన్న దందాలు… యువకులను బెదిరించే ముఠాలు ఎక్కువయ్యాయి. జనాన్ని భయ పెట్టడానికి ఆయుధాల్ని వెంటబెట్టుకుంటున్నారు. ఇలాంటివారిలో ఎక్కువ మంది గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడినవారున్నారని పోలీసులే చెప్తున్నారు.

సాధారణంగా తగాదాలు, సెటిల్ మెంట్ల కేసుల్లో ఉన్న రౌడీషీటర్లను పోలీసులు… ప్రతివారం స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇస్తారు. వారిపైనా నిఘా ఉంచుతారు. కరోనా నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. శనివారం నాటి గ్యాంగ్ వార్‌లో చనిపోయిన సందీప్‌పై గతంలో రౌడీషీట్ ఉన్నా 2015లో తీసేశారు. అప్పట్నుంచి అతనిపై నిఘా ఉంచలేదనే ఆరోపణలున్నాయి. పోలీస్ స్టేషన్ల పరిధిలో… ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారేమో దృష్టిసారించాల్సిన పోలీసులు, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసే స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పసిగట్టలేకపోవడం వైఫల్యంగా భావిస్తున్నారు. ఈ విషయంపై నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు సదరు పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువత గొడవలు , కొట్లాటలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేసులు నమోదైతే….. భవిష్యత్‌లో పాస్‌పోర్టులు, ఉద్యోగాలు రావడం కష్టమని హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల నడవడికపై నిఘా ఉంచాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This