‘ఎస్‌ఈసీ చర్యలు కుట్రపూరితం.. కోడ్ ముగిశాక అన్నీ సరి చేస్తాం’

రాష్ట్ర ఎన్నికల కమిషనరు ఓ పార్టీ తరఫున కుట్రదారుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్నికల కోడ్‌ ముగిశాక అన్నింటినీ సరి చేస్తాం. ఏ అధికారికీ అన్యాయం జరగనివ్వబోం. వారి విశ్వసనీయతను, ఆత్మస్థైర్యాన్ని కాపాడతాం’ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు ఏం తప్పు చేశారని వారిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి మంగళవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సదాలోచనలతోనే ఎస్‌ఈసీ తన విచక్షణాధికారాలను వినియోగిస్తే బాగుంటుందన్నారు. ఇష్టమొచ్చినట్లు ఆదేశాలనిచ్చి అధికారులను, ప్రజలను భయభ్రాంతులను చేయాలనుకోవడాన్ని ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ఏకగ్రీవాలయ్యే పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన వ్యాఖ్యానించారని, ఆయనతో కొన్ని శక్తులు అలా మాట్లాడిస్తున్నాయని పెద్దిరెడ్డి చెప్పారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను లోగడ పెంచినప్పుడు చాలా బాగున్నాయని ఇదే ఎస్‌ఈసీ అన్నారని వివరించారు.

అలా అంటే తప్పే: మంత్రి బొత్స
ఏకగ్రీవమయ్యే పంచాయతీలపై దృష్టి పెట్టేందుకు ప్రత్యేకాధికారిని నియమిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనరు వ్యాఖ్యానించి ఉంటారని తాననుకోవడం లేదని, ఆయన అలా అనుంటే అది కచ్చితంగా తప్పేనని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలనివ్వడం 2001 నుంచే ప్రారంభమైందని గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This