డబ్ల్యూహెచ్‌ఓలో అమెరికా స్థానాన్ని భర్తీ చేసేదెవరు?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాను డిమాండు చేసిన సంస్కరణలు చేపట్టకపోతే ఆ సంస్థతో తెగతెంపులు చేసుకొంటామనీ, సంస్థకు ఇచ్చే నిధులను అంతర్జాతీయంగా కీలక ప్రజారోగ్య రక్షణ పథకాలకు మళ్లిస్తామని గత నెల చివరిలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. బహుళ పక్ష సహకారాన్ని పక్కనపెట్టి స్వదేశ ప్రాధాన్యాలకు, ప్రయోజనాలకు అమెరికా పట్టం కట్టడం ఇదే మొదటిసారి కాదు. 2017 అక్టోబరులోనూ అమెరికా ఇదేమాదిరిగా ఐక్యరాజ్యసమితి విద్య, సామాజిక, సాంస్కృతికి సంస్థ (యునెస్కో) నుంచి వైదొలగింది.

‘యుద్ధాలు మనుషుల మస్తిష్కాలలో మొదలవుతాయి కాబట్టి, శాంతి దుర్గాలను అక్కడే నిర్మించాలి’ అని యునెస్కో పీఠికలో రాసిన వ్యక్తి స్వయంగా అమెరికన్‌ జాతీయుడైన ఆర్చిబాల్డ్‌ మెక్‌ లీష్‌. ఆయన యునెస్కో ప్రథమ నిర్వహణ సంఘ సభ్యుడు కూడా. యునెస్కో నిరంతరం ఇజ్రాయెల్‌ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందనీ, ఆ సంస్థలో సంస్కరణలు రావలసి ఉందనీ వాదిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం యునెస్కో నుంచి కూడా వైదొలగింది. ఆ సంస్థకు అమెరికా వాటా నిధులు బకాయి పడిపోయాయి. ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఏర్పరచిన మానవ హక్కుల పరిరక్షణ మండలి నుంచి కూడా 2018 జూన్‌లో అమెరికా నిష్క్రమించింది. ఈ సంస్థ సైతం ఇజ్రాయెల్‌ వ్యతిరేక పంథా అనుసరిస్తోందని ట్రంప్‌ సర్కారు ఫిర్యాదు. ఇంతకీ డబ్ల్యూహెచ్‌ఓ ఎలాంటి సంస్కరణలు చేపట్టాలో ట్రంప్‌ విస్పష్టంగా ప్రతిపాదించలేదు. డబ్ల్యూహెచ్‌ఓ మీద చైనాకు పూర్తి అదుపు ఉందనీ, కరోనా వైరస్‌ విస్పోటనం గురించి చైనాకు ముందే తెలిసినా, డబ్ల్యూహెచ్‌ఓకు ఆ విషయం చెప్పకుండా తప్పుదోవ పట్టించిందని ట్రంప్‌ ఆరోపణ. కానీ, ఆయన అదే నోటితో ‘చైనా కరోనా వైరస్‌ను నియంత్రించడానికి హోరాహోరీ ప్రయత్నం చేస్తోంది’ అని జనవరి 24న పేర్కొన్న సంగతి మరచి పోయారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This