మలయాళ కథలపై మనసు పడిన టాలీవుడ్​!

తెలుగులో వైవిధ్యమైన కథలకి కొదవ లేదు. యువతరం వెండితెర కోసం పోటాపోటీగా కొత్త తరహా కథల్ని సిద్ధం చేస్తోంది. ఇలా చేతిలో ఎన్ని కథలున్నా… మరో మంచి సబ్జెక్టు తారసపడిందంటే, అది విజయవంతమైందని తెలిస్తే.. వెంటనే దానిపై కర్చీఫ్‌ వేసేస్తుంటారు దర్శకనిర్మాతలు. అలా పొరుగు కథలు విరివిగా తెలుగులోకి వచ్చేస్తుంటాయి. ఇటీవల మలయాళ కథలు మనవాళ్లని బాగా ఆకర్షిస్తున్నాయి. సహజమైనవి కావడం.. మన ప్రేక్షకులకు, మనదైన నేపథ్యానికి తగ్గట్టుగా ఉండటం వల్ల వాటిని రీమేక్‌ చేయడంపై ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.

అల్లు అర్జున్‌ను మలయాళంలో మల్లు అర్జున్‌ అని పిలుస్తారు. అల్లు అర్జున్‌, ప్రభాస్‌ సినిమాలు, శేఖర్‌ కమ్ముల సినిమా విడుదలైనా సరే.. తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో సందడి కనిపిస్తుందో, కేరళలోనూ అంతే. అక్కడి ‘దృశ్యం’ ఇక్కడ రీమేక్​గా వచ్చి ఘన విజయం సాధించింది. అక్కడి ‘ప్రేమమ్‌’’ ఇక్కడా ‘ప్రేమమ్‌’ అయింది. తెలుగుకీ, మలయాళంకీ మధ్య బంధం అంతగా పెనవేసుకుపోయింది. అభిరుచులు కూడా కలిసిపోయాయి. కథలు ఇచ్చి పుచ్చుకోవడానికి ఇంతకుమించి ఇంకేం కావాలి? ఇటీవలే విడుదలైన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. అది మలయాళ చిత్రం ‘మహేషింతే ప్రతీకారమ్‌’కి రీమేక్‌గా రూపొందింది. ఈ పరంపర ఇంకా కొనసాగనుంది.

చిరు కోసం

మలయాళ అగ్ర కథానాయకుల సినిమాలు మొదలుకొని.. అక్కడి యువ హీరోలు చేసిన చిత్రాల వరకూ తెలుగులో రీమేక్‌ అవుతుంటాయి. అన్ని వయసుల్ని, అన్ని రకాల నేపథ్యాల్ని ప్రతిబింబించేలా కథలు సిద్ధమవుతుంటాయి. మన హీరోల ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉండటం వల్ల తెలుగు పరిశ్రమకి ఆ కథలు బాగా నచ్చుతుంటాయి. మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌ కలిసి నటించిన ‘లూసిఫర్‌’ చూసి రామ్‌చరణ్‌ రీమేక్‌ హక్కుల్ని కొన్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఆ కథలో చిరంజీవి నటిస్తే బాగుంటుందని ఆయన ఆలోచన. ఆ చిత్రం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, బిజూ మేనన్‌ కలిసి నటించిన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ తెలుగు రీమేక్‌ హక్కుల్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సొంతం చేసుకుంది. ఆ చిత్రాన్ని రానా, రవితేజ హీరోలుగా రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సితార సంస్థే మరోచిత్రం ‘కప్పేలా’ని తెలుగులో రీమేక్‌ చేయబోతోంది. అందులో ఇద్దరు యువ హీరోలు నటించనున్నారు. పృథ్వీరాజ్‌ నటించిన మరో చిత్రం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ తెలుగులో రీమేక్‌ అవుతుందని సమాచారం. అందులో ఓ అగ్ర కథానాయకుడు నటిస్తారని ప్రచారం సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This