తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ

ముక్కోటి దేవతలు.. అష్టదిక్పాలకులు.. అపురూపంగా వెంటరాగా.. దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో తరలివచ్చిన భక్తజన గోవింద నామస్మరణల మధ్య అంగరంగ వైభవంగా సాగే అర్చకావతార మూర్తి.. కలియుగ వైకుంఠనాథుని బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది నిరాడంబరంగా సాగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలతో.. పూటకో వాహనంపై అధిష్టించి నాలుగు మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేసే మలయప్ప.. ఈ ఏడాది ఏకాంతంగా ఆలయ ప్రాకారంలోనే పూజలు అందుకోనున్నారు.

కరోనా ప్రభావంతో గడచిన నాలుగు నెలలుగా శ్రీవారికి నిర్వహించే వైదిక కార్యక్రమాలన్నీ ఏకాంతంగా నిర్వహించిన తరహాలోనే బ్రహ్మోత్సవాలను చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో నిత్య కళ్యాణం జరిగే సంపంగి ప్రాకారంలో స్వామివారి వాహన సేవలు నిర్వహించనున్నారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామిని తిరుచ్చిపై విమాన ప్రాకారంలో ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం.. సంపంగి ప్రాకార మండలంలోని వాహనాలపై వేంచేపు చేసి ఉత్సవాలు నిర్వహించనున్నారు. సాధారణ రోజుల్లో బ్రహ్మోత్సవాల వేళ మంగళవాయిద్యాలు, దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేసిన మలయప్ప స్వామి.. ఈ ఏడాది ఆలయ ప్రాకారానికే పరిమితం కానున్నారు.

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనుండటంతో వాహన సేవల సమయాల్లో మార్పు చేశారు. గతంలో వాహనాలపై అధిరోహించిన శ్రీవారు నాలుగు మాఢ వీధుల్లో రెండు గంటల పాటు ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేసేవారు. ఉదయం జరిగే వాహనసేవలు తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకూ.. రాత్రి వాహన సేవలు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు సాగేవి. కరోనా ప్రభావంతో ఉత్సవాలు ఆలయానికే పరిమితమవడంతో వాహన సేవల సమయాన్ని గంటకు పరిమితం చేశారు. ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసంలో రెండు మార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది అధికమాసం కావడంతో వార్షిక, నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ రోజు సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. నవధాన్యాలతో అంకురార్పణ, ఇతర వైధిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 6.03 నుంచి 6.30 గంటల మధ్య మీనలగ్నంలో ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ నిర్వహించే ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

శనివారం రాత్రి 8.30 గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు ఉత్సవాలలో తొలి వాహనమైన పెద్దశేష వాహనంపై స్వామివారిని వేంచేపు చేయడంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. వాహన సేవను కొలువుదీర్చిన అనంతరం ఉత్సవమూర్తులకు నైవేద్య సమర్పణ, పరవట గౌరవ మర్యాదలు, మంగళవాయిద్యాల నడుమ వేదగోష్టిని అర్చకులు, జీయంగార్లు నిర్వహిస్తారు. శాత్తుమెర, సల్లింపు, స్నపన తిరుమంజన కార్యక్రమాలను కల్యాణమండపంలోనే నిర్వహిస్తారు. ఉత్సవాల చివరి రోజున నిర్వహించే చక్రస్నాన కార్యక్రమాన్ని ఆలయంలో అద్దాల మండపంలో నిర్వహించేందుకు నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This