‘అందరూ చేతులు కలిపితేనే… అది సాధ్యం’

ప్రకృతి తల్లి ఒడిలో శిశువుగా ఒదిగి ఎదిగిన మనిషి ప్రగతి ప్రణాళికల పేరిట వనరుల విధ్వంసానికి తద్వారా మాతృద్రోహానికి తెగబడుతున్న పర్యవసానంగానే, పర్యావరణానికి ఇంతగా తూట్లు పడుతున్నాయి. భూతాపం పెరిగి, వాతావరణ మార్పులు దాపురించి, ప్రాణాంతక ఉత్పాతాలు సంభవిస్తున్నాయి.

ఇకనైనా.. మానేస్తే మంచిది

నలభై సంవత్సరాలక్రితం జెనీవా వేదికగా యాభైదేశాలు పాల్గొన్న ప్రథమ ప్రపంచ పర్యావరణ సదస్సు- పోనుపోను సమస్య తీవ్రరూపం దాల్చి పెనుసంక్షోభం కానుందని సరిగ్గానే గుర్తించింది. గడచిన నాలుగు దశాబ్దాల్లో ఘనతర తీర్మానాలెన్ని మోతెక్కినా, దీటుగా స్పందించడంలో దేశదేశాల ప్రభుత్వాలెన్నో విఫలమయ్యాయని- ‘బయోసైన్స్‌’ పత్రికలో తాజాగా ప్రచురితమైన విశ్లేషణ పత్రం తూర్పారపట్టింది.

అది 153 దేశాలకు చెందిన 11వేల మందికిపైగా శాస్త్రవేత్తల అధ్యయన సారాంశం. భూమండలంపై ప్రస్తుతం పర్యావరణ ఆత్యయిక స్థితి నెలకొందని ఉమ్మడిగా తీర్మానించిన శాస్త్రవేత్తల బృందం- చేటు వాటిల్లజేసే చర్యల్ని ఇకనైనా మానకపోతే మానవాళి భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తోంది.

వీడని విషవాయువులు

అడవుల నరికివేతను అడ్డుకోవాలని, శిలాజ ఇంధన వినియోగం తగ్గించాలని, ఆహార వృథాను అరికట్టాలని, జన విస్ఫోటాన్ని నియంత్రించాలని… బహుళ పార్శ్వ కార్యాచరణను ప్రతిపాదిస్తోంది. ఒకసారి విడుదలైన బొగ్గుపులుసు వాయువు, నైట్రస్‌ ఆక్సైడ్‌ వంటివి వందేళ్లపాటు వాతావరణంలో నిలిచి ఉండి విధ్వంసక పాత్ర పోషిస్తూనే ఉంటాయి.

అందువల్ల పర్యావరణం మరింతగా దెబ్బతినిపోకుండా దేశదేశాలు తమవంతుగా ఏమేమి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉందో శాస్త్రవేత్తల హితబోధ చాటుతోంది. మానవాళి భవితవ్యమే ప్రశ్నార్థకమైన తరుణంలో, భూతాప నియంత్రణ క్రతువును సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉంది!

ఒప్పందాలూ నామమాత్రమేనా?

కర్బన ఉద్గారాల నియంత్రణకు, భూతాప కట్టడికి ఉద్దేశించిన చరిత్రాత్మక ప్యారిస్‌ ఒప్పందానికి ఏ గతి పట్టిందో పరికిస్తే- ప్రకృతి వినాశానికి ఇప్పట్లో అడ్డుకట్ట పడుతుందా అనే శంకలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. మూడేళ్లక్రితం జి-20 సదస్సుకు ఒక్క రోజు ముందు చైనా, అమెరికాల సంయుక్త ప్రకటన ప్యారిస్‌ ఒడంబడిక అమలు సజావుగా పట్టాలకు ఎక్కనుందన్న ఆశలు రేకెత్తించింది.

కర్బన ఉద్గారాల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్న వాటి మొత్తం వాటా దాదాపు 40 శాతం. తాను విడుదల చేస్తున్న 4.5శాతం రాశి ఆ రెంటితో పోలిస్తే చాలా తక్కువే అయినా, 2020 నాటికి భూతాపంలో పెరుగుదలను రెండు డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పరిమితం చేసే కృషిలో పాల్గొనడానికి భారత్‌ ముందుకొచ్చింది.

అలా సంతకాలు చేసిన దాదాపు రెండు వందల దేశాలు పర్యావరణ హితకరమైన ఇంధన వినియోగాన్ని, అటవీ ఆచ్ఛాదనను పెంచడానికి, కర్బన ఉద్గారాలు తగ్గించడానికి సన్నద్ధమయ్యాయి. పెడసర ధోరణులకు మారుపేరైన డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేత సౌధాధిపతిగా కుదురుకోగానే ప్యారిస్‌ ఒడంబడికను నీరు కార్చే యత్నాలు మొదలయ్యాయి. ఆ ఒప్పందంనుంచి అమెరికా వైదొలగే ప్రక్రియ ఈ వారంలోనే అధికారికంగా ఆరంభమైంది.

అగ్రరాజ్యం లేకితనం మంచిదేనా?

లోగడ క్యోటో ఒడంబడికపై ప్లేటు ఫిరాయించిన అగ్రరాజ్యం ప్యారిస్‌ ఒప్పందం విషయంలోనూ లేకితనం ప్రదర్శించింది. ‘పురిటిగడ్డను నాశనం చేసుకునే జాతి ఆత్మ వినాశాన్ని కొని తెచ్చుకుంటుంది’ అని ఏడు దశాబ్దాల క్రితం అమెరికా అధ్యక్షుడిగా ఫ్రాంక్లిన్‌ డి.రూజ్‌వెల్ట్‌ చేసిన వ్యాఖ్యలను అక్షర సత్యాలుగా నిరూపించాలని ట్రంప్‌ కంకణం కట్టుకున్నట్లుంది!

ఈ దుందుడుకు పోకడల్ని గర్హిస్తూ ఆ మధ్య అమెరికాలోని మేయర్లు, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, అధికార ప్రముఖులు 14 వందలమంది ప్యారిస్‌ ఒప్పంద స్ఫూర్తికే కట్టుబాటు చాటారు. వైదొలగే ప్రక్రియ ముగియడానికి ఏడాదికాలం పడుతుందని, అప్పటికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యి ట్రంప్‌ నిష్క్రమించిన పక్షంలో అసంబద్ధ నిర్ణయాన్ని తిరగదోడే వీలుందంటున్న డెమొక్రాట్ల విశ్లేషణ- ఏ మేరకు నిజమవుతుందో చూడాలి!

భూతాప ప్రతాపం

వాతావరణాన్ని మృత్యుపాశావరణంగా మార్చేస్తున్న ఘోర విపత్తు- భూతాపంలో పెరుగుదల. దాని విధ్వంసక సామర్థ్య తీవ్రతకు దాఖలాలు ఒకటా, రెండా? అమెరికాలో మైనస్‌ నలభై డిగ్రీలకు ఉష్ణోగ్రతల పతనం, ఆస్ట్రేలియా వంటిచోట్ల దశాబ్దాలుగా కనీవినీ ఎరుగనంతటి అధిక ఉష్ణోగ్రతల నమోదు, సహారా ఎడారిపై మంచుదుప్పటి, ప్రపంచం నలుమూలలా భరించశక్యంకాని వడగాడ్పులు, వరదలు, తుపానులు, కరవు కాటకాల విజృంభణ… అన్నీ భూతాపంలో వృద్ధి తాలూకు విపరీత అనర్థాలే.

పిల్లలు ప్రశ్నిస్తున్నారు..

ఊళ్లను నగరాల్ని ముంచేస్తున్న కుంభవృష్టులు, గతి తప్పుతున్న రుతువులు, పెచ్చరిల్లుతున్న పంట నష్టాలకు మూలకారణం వాతావరణంలో అనూహ్య మార్పులే. ఈ మహోద్ధృతిని నివారించడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వాలు సమస్యకు సరైన పరిష్కారం కనుక్కోలేకపోయాయని పోలండ్‌ వేదికపై పదిహేనేళ్ల బాలిక గ్రేటా వివిధ దేశాల నాయకశ్రేణుల్ని సూటిగా తప్పు పట్టింది.

ఇప్పటికైనా ఏకమవ్వాల్సిందే..

దశాబ్దాలుగా ప్రపంచం నలుమూలలా అరకొర చర్యల్ని వెన్నంటి, నిష్పూచీగా పర్యావరణ విధ్వంసానికి పావులు కదిపిన ట్రంప్‌ పాపం- యావత్‌ మానవాళి మనుగడకే విఘాతకరంగా పరిణమించనుంది. ఐక్యరాజ్యసమితి సారథిగా బాన్‌ కీ మూన్‌ ఇదివరలో పిలుపిచ్చినట్లు- ‘భూగోళాన్ని కాపాడుకోవడానికి అందరూ చేతులు కలపాల్సిందే’!

దేశదేశాల బాధ్యతాయుత స్పందన, ఏకోన్ముఖ కార్యాచరణలే భూతాపంలో వృద్ధిని నివారించడంలో నిర్ణయాత్మకమవుతాయి. భూమండలంపై దారుణ నిర్లక్ష్యం ఇంకా ఇలాగే కొనసాగితే, మరో ఆరువందల సంవత్సరాల్లో మానవ జాతే నామరూపాల్లేకుండా తుడిచి పెట్టుకుపోతుందన్న స్టీఫెన్‌ హాకింగ్‌ హెచ్చరిక- ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This