శీతలీకరణ ముందురోజే ఆపేశారు: ఎన్జీటీ కమిటీ

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదాన్ని నిమిషాల వ్యవధిలోనే పసిగట్టినా, దాన్ని నిరోధించడంలో సంస్థ ఉద్యోగులు విఫలమయ్యారని ఎన్జీటీ కమిటీ నివేదిక తేల్చిచెప్పింది. తీవ్రమైన మానవ తప్పిదాలు, బాధ్యులైన అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణలో వైఫల్యాలు ప్రమాదానికి ప్రధాన కారణాలని స్పష్టం చేసింది. సంస్థ ఎండీ, భద్రతాధికారి, భద్రతా విభాగం, ఉత్పత్తి విభాగం తదితర విభాగాల్లో జవాబుదారీతనం కొరవడిందని ఎత్తిచూపింది.

గురువారం జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు కమిటీ తన నివేదికను సమర్పించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ శేషశయనారెడ్డి ఆధ్వర్యంలో ఏయూ ఆచార్యులు సి.హెచ్‌.వి.రామచంద్రమూర్తి, ఆచార్య పి.జె.రావు, నీరి శాస్త్రవేత్త బాషా, సీపీసీబీ సభ్య కార్యదర్శి, సీఎస్‌ఐఆర్‌ సంచాలకులు ఇచ్చిన నివేదికలోని ప్రధాన అంశాలివి.

* ప్రమాదం ఈ నెల 7న తెల్లవారుజామున 2.42కు జరిగింది. 2.54కు, 3.02కు డిజిటల్‌ కంట్రోల్‌ సిస్టం అలారాలు మోగాయి. రాత్రి విధులు నిర్వహించే అధికారి ప్రమాదాన్ని గుర్తించి ఇతర ఉద్యోగుల్ని అప్రమత్తం చేశారు. కానీ ప్రజల్ని అప్రమత్తం చేసే అలారాలను మోగించలేదు. అలారం మీట ఉన్న ప్రాంతానికి స్టైరీన్‌ ఆవిర్లు వ్యాపించడంతో వారు అక్కడికి వెళ్లలేకపోయారు.

* 3.30 గంటలకల్లా ఎల్‌జీ పాలిమర్స్‌కు చెందిన కీలక ఉన్నతాధికారులందరూ చేరుకున్నారు. 5.15 గంటలకు గానీ ‘ఇన్‌హిబిటర్స్‌’గా ఉపయోగించే రసాయనాల్ని చల్లలేదని చెబుతున్నారు.

* స్టైరీన్‌ ట్యాంకులో టీబీసీ రసాయనం 15 పీపీఎం ఉండేలా చూసుకోవాల్సి ఉండగా దాన్ని కలిపిన దాఖలాలు లేవు. ఇది ప్రమాదానికి ప్రధాన కారణం.

* ట్యాంకు పాతది కావడంతో అందులో ఉష్ణోగ్రత ఎంత ఉందో చూపించే ఉష్ణమానినులు లేవు. దీంతో ఉష్ణోగ్రతలను సకాలంలో గుర్తించలేకపోయారు.

* స్టైరీన్‌ ట్యాంకులో ఉష్ణోగ్రతలు పెరగకుండా ట్యాంకును శీతలీకరిస్తుంటారు. రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటున్నాయన్న ఉద్దేశంతో సంస్థ ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకల్లా శీతలీకరణ ప్రక్రియ వ్యవస్థను నిలిపేస్తోంది. ప్రమాదానికి ముందురోజు కూడా సాయంత్రం 5 గంటలకల్లా శీతలీకరణ యంత్రాన్ని ఆపేశారు. ఇదీ ప్రమాదానికి ప్రధాన కారణాల్లో ఒకటి.

* స్టైరీన్‌ కారణంగా ఎలాంటి ప్రమాదం సంభవించకుండా అందుబాటులో ఉంచుకోవాల్సిన పీటీబీసీ రసాయనం కూడా సంస్థలో లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This