‘అదే నిజమైతే రోహిత్​పై చర్యలు తీసుకుంటారా?’​

రోహిత్​ శర్మ తొడ కండర గాయంపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు వారాల పాటు ఐపీఎల్​కు దూరమయిన అతడు అనూహ్యంగా దిల్లీతో లీగ్​ ఆఖరి మ్యాచ్​లో బరిలోకి దిగాడు. ఒకవేళ రోహిత్‌ గాయాన్ని లెక్క చేయకుండా ఆడివుంటే అతడిపై బీసీసీఐ చర్యలు తీసుకుంటుందా? అని మాజీ కెప్టెన్‌ వెంగ్‌సర్కార్‌ ప్రశ్నించారు. సునీల్‌ గావస్కర్‌ మాత్రం రోహిత్‌ మ్యాచ్‌ ఆడటం టీమ్‌ఇండియాకు శుభవార్త అన్నారు.

“భారత జట్టులో అత్యంత కీలక ఆటగాడు రోహిత్‌శర్మ ఫిట్‌గా లేడంటూ ఫిజియో నితిన్‌ పటేల్‌ కొన్ని రోజుల క్రితమే నివేదిక ఇచ్చారు. ఫలితంగా ఆస్ట్రేలియా పర్యటనకు అతడిని ఎంపిక చేయలేదు. అలాంటిది రోహిత్‌ ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. టీమ్‌ఇండియా కంటే ఐపీఎల్‌ అతడికి ఎక్కువ ముఖ్యమా అన్నది అసలు ప్రశ్న. అతడిపై బీసీసీఐ చర్యలు తీసుకుంటుందా? లేదా రోహిత్‌ గాయం తీవ్రతను అంచనా వేయడంలో బీసీసీఐ ఫిజియో విఫలమయ్యారా?”

–దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, భారత మాజీక్రికెటర్​

“రోహిత్‌ గాయం గురించి ఇప్పటి వరకు జరిగిన దాన్ని పక్కన పెడితే అతడు ఫిట్‌గా ఉండటం టీమ్‌ఇండియాకు గొప్ప శుభవార్త. అతడు తొందరపడితే గాయం తిరగబెట్టొచ్చన్న అందరి ఆందోళనల్లోనూ అర్థం ఉంది. అయితే రోహిత్‌ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. తాను ఫిట్‌గా ఉన్నట్లు తెలియజేయడానికి రోహిత్‌ మ్యాచ్‌ ఆడాడు.”

— సునీల్‌ గావస్కర్‌, భారత మాజీక్రికెటర్​

ఆస్ట్రేలియా పర్యటనకు స్టార్​ ఓపెనర్​ రోహిత్​ శర్మను ఎంపిక చేయకపోవడం.. వివాదానికి దారి తీసింది. సిరీస్‌ సమయానికి ఫిట్‌నెస్‌ సాధించడేమో అన్న అనుమానంతో.. అతడిని భారత సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This