విద్యా ప్రణాళికే ప్రగతికి చుక్కాని.. కానీ సవాళ్లెన్నో!

ఒక దేశ అభివృద్ధి క్రమంలో నాణ్యమైన విద్యావిధానాలు కీలక పాత్ర పోషిస్తాయి. దాదాపు మూడు దశాబ్దాల తరవాత జాతీయ విద్యా విధానంలో సంస్కరణలకు తెరతీశారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాభ్యాసం సాగాలని దిశానిర్దేశం చేయడం, ఉన్నత చదువులకు సంబంధించి ప్రాథమ్యాలనుబట్టి పాఠ్యాంశాలు ఎంపిక చేసుకునే వెసులుబాటును విద్యార్థులకు కల్పించడం, విద్యారంగంలోకి పెద్దయెత్తున ప్రైవేటు పెట్టుబడులకు తెరచాపలెత్తడం, విద్యాసంస్థల స్వీయ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు ఎంతగానో ఆహ్వానించదగినవి. జాతీయ నూతన విద్యా విధాన దార్శనిక ప్రకటనలో చదువుల నాణ్యత గురించి ప్రస్తావించారుగానీ- దాన్ని పెంచేందుకు సుస్పష్ట ప్రణాళికలను మాత్రం వివరించలేదు.

బడుగు వర్గాలకు చెందిన విద్యార్థుల సామాజిక ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా వారికి ఏ విధంగా తోడ్పాటు అందించాలన్న విషయాన్నీ ఇందులో విస్మరించారు. వచ్చే 15 ఏళ్లకు దేశంలో పూర్తి అక్షరాస్యత సాధన, ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని 40శాతం నుంచి 50 శాతానికి చేర్చడం వంటి లక్ష్యాలను నిర్దేశించారు. వీటి సాధనకు అనుసరించాల్సిన ప్రణాళికలు, సలహాలను మాత్రం అందులో పొందుపరచలేదు. విద్యావ్యవస్థలోని వివిధ స్థాయుల్లో నాణ్యతను ఎలా పెంచాలన్న నిర్దిష్ట ప్రణాళికల ప్రస్తావనా నూతన విద్యావిధానంలో కొరవడింది.

ఉపాధ్యాయుల ప్రమాణాలు

విద్యా ప్రణాళికే ప్రగతికి చుక్కాని చదువుల నాణ్యతకు ఉపాధ్యాయుల ప్రమాణాలు, వారి అంకితభావం, నైపుణ్యాలే దోహదపడతాయి. మంచి వేతనాలతోపాటు ఉపాధ్యాయులకు సరైన సామాజిక గుర్తింపు, ఇతర సౌకర్యాలు కల్పిస్తేనే అంకితభావం, నైపుణ్యాలు కలిగినవారిని ఈ వృత్తిలోకి ఆకర్షించేందుకు వీలవుతుంది. అందుకోసం ఇంజినీరింగ్‌ సర్వీసులు, ఫారెస్ట్‌ సర్వీసుల తరహాలోనే జాతీయ, రాష్ట్రీయ స్థాయుల్లో విద్యా నియామక సేవల విభాగాలు ఏర్పాటు కావాలి. విద్యాబోధన, పర్యవేక్షణలతో ముడివడిన ఉద్యోగాలను ఈ విభాగాల ద్వారా నియమిస్తేనే ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు వీలవుతుంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులకు కొత్త పద్ధతుల్లో శిక్షణ ఇచ్చి, వారికి సరికొత్త నైపుణ్యాలు అలవరచాలి. అప్పుడే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ విషయంలో సమగ్రమైన, సహేతుకమైన సూచనలేవీ నూతన విధానంలో కనిపించడం లేదు. దేశ అవసరాలేమిటి, ఏ రంగానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, ఏయే స్థానాల్లో ఎలాంటి మానవ వనరులు ఉండాలి వంటి వాటిపై సహేతుక అంచనాలుండాలి. ఆ మేరకు మానవ వనరులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పరచుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This