బయో బబుల్​లోనే ఉన్నా.. కలవొద్దంటే ఎలా?

“నేను జుట్టు కత్తిరించుకోవాలంటే ఎలా”.. “అందరం బబుల్‌లోనే ఉన్నాం కదా! మరి అలాంటప్పుడు సహచర ఆటగాడి గదిలోకి ఎందుకు వెళ్లకూడదు”.. “ఫొటోషూట్‌ సమయంలో ఒకరిని మరొకరు హత్తుకోవచ్చా”.. ఐపీఎల్‌ ప్రతినిధులు నిర్వహించిన వెబినార్‌లో క్రికెటర్లు ఇలాంటి ప్రశ్నలెన్నో లేవనెత్తారు. అయితే నిబంధనల ప్రకారం క్వారంటైన్‌ మొదలుకుని టోర్నీ ముగిసేంతవరకూ ఓ ఆటగాడు మరో ఆటగాడి గదికి వెళ్లడానికి వీల్లేదు. అవసరం అనుకుంటే గది తలుపుల దగ్గరో, ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశంలోనో మాట్లాడుకోవాలి. ఆ సమయంలో కచ్చితంగా రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలి.

“ఒకరి గదుల్లోకి మరొకరు వెళ్లకూడదనే నిబంధన క్రికెటర్లయిన మాకు కఠినంగా తోస్తుంది. గతంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. సుదీర్ఘ కాలం పాటు ఇంటికి దూరంగా ఉంటున్న సమయంలో మాట్లాడుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. అలా చేయకూడదని చెప్పడం సులువే. కానీ అలా ఉండడమే కష్టం. మాకు మరో మార్గం లేదు. మా కోసం కేటాయించిన బీచ్‌, జిమ్‌, గదిలో మేం కలవొచ్చు. కానీ భౌతిక దూరం పాటించాలి” అని రాజస్థాన్‌ రాయల్స్‌ పేసర్‌ జయదేవ్​‌ ఉనద్కత్‌ పేర్కొన్నాడు.

దగ్గరకొస్తే అంతే:

ఒకవేళ ఆటగాళ్లు భౌతిక దూరం సంగతి మర్చిపోయి దగ్గరగా వచ్చారంటే వెంటనే అలారం మోగుతుంది. దాని కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్లూటూత్‌ పరికరాన్ని ఆటగాళ్లు చేతికి ధరించాల్సి ఉంటుంది. నిద్రపోయే సమయంలో మాత్రమే వాళ్లు దాన్ని చేతి నుంచి తీయాలి. ఆటగాళ్లతో కలిసి ఉంటున్న కుటుంబ సభ్యులు కూడా దాన్ని తప్పనిసరిగా ధరించాలి. అయితే అది ఎలా పనిచేస్తోందన్న దానిపై సమాచారం లేదు. జట్టు ప్రయాణించే బస్సులోనూ ఆటగాళ్లు దూరంగా కూర్చోవాలి. బయట ఆహారాన్ని అనుమతించట్లేదు కాబట్టి హోటల్‌ భోజనంతోనే సరిపెట్టుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This