కోటి రాగాల గళం మూగబోయిందంటే ఎట్టా నమ్మేది?

పాటల పూదోటలో సప్తస్వరాలతో సయ్యాటలాడిన ఆ తోటమాలి ఇక లేడు! ఐదు దశాబ్దాలుగా, రస హృదయాలను రాగరంజితం చేసిన మహాగాయకుడు పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం పరమపదించారు. సుస్వరాలతో సర్వేశ్వరుణ్ని అర్చించిన ‘శంకరాభరణం’ ఆయన! తెలుగునాట పుట్టి, తన దివ్యగళంతో దిగంతాలకూ వ్యాపించిందా ఆ సమ్మోహనపరిమళం! యాభై ఏళ్లకు పైగా తెలుగు పాటంటే.. బాలు.. మంచి మాటంటే బాలు! ఈ పండితారాధ్యుడు పండితులకు పామరులకూ ఆరాధ్యుడే!

తన సంకీర్తనామృతంతో శ్రీనివాసుని పరవశింపజేసిన అన్నమయ్య దూరమవుతుంటే.. సాక్షాత్తూ స్వామివారే ఎలా తల్లడిల్లిపోయారో.. సెల్యులాయిడ్​పై చూశాం. లాలిపాటలు… జోలపాటలు లాంటి 32 వేల సంకీర్తనలతో తనను పరవశింపజేశావని శ్రీవారు అంటుంటే అది హృద్యంగా తాకింది. సాక్షాత్ శ్రీ వేంకటేశ్వరుడే పలికినట్లుగా వినిపించిన ఈ గంభీరగళం నీదే కదా! అన్నమయ్య పాటలకు మురిసి, తల్లడిల్లిపోయిన నీవు.. 40వేల పాటలతో మైమరిపించి…స్వరాల ఊయలూగించి..ఇంకా. ఇంకా వినాలనిపించేంత మత్తును కలిగించి.. ఇలా అర్థాంతరంగా వెళ్లడం న్యాయమా?

“మరణమనేది.. ఖాయమని.. మిగిలెను కీర్తి కాయమని” నువ్వు పాటలో చెప్పినా.. ” నరుడు బ్రతుకు.. నటన.. ఈశ్వరుడి తలపు ఘటన” అని బతుకు పరమార్థాన్ని వివరించినా.. మా తపన ఆగునా! 54 ఏళ్లుగా నీతో పాటు నడిచిన పాట.. ఇప్పుడు… ఒంటరిదైపోయింది. ఇన్నేళ్ల కాలంలో ఎన్నిపాటలతో పరవశించాం.. ఎంత మందిలో నీ గళాన్ని చూసుకున్నాం..? తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్ల లాంటి ఎన్టీఆర్, ఏఎన్నార్​లకు, తర్వాత తరంలోని కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబులకు, ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వెంకటేశ్​ల నుంచి నేటి నవతరంలోని శర్వానంద్ వరకూ గళాన్నందించావ్. తాతలకు.. మనవళ్లకూ కూడా పాటలు పడిన ఘనత నీకు మాత్రమే కదా!

లాలి పాటలు, జోలపాటలు, చిలిపిపాటలు, కొంటెపాటలు, యుగళగీతాలు, శృంగార గీతాలు, భక్తి పాటలు , ముక్తి పాటలతో రక్తి కట్టించావు. రసరమ్యమైన పాటలతో ప్రతీరాత్రిని వసంతరాత్రులు చేశావు. సింధూరపు మందారపు వన్నెలను వాకిళ్లకు తెచ్చావు. దివిలో విరిసిన పారిజాతాలను మా పెరటిలో పరిమళింపజేశావు. సినిమాలో ఎన్టీఆర్ ఉంటే.. పాడేది బాలూ కాదు.. ఎన్టీఆరే.. ఏఎన్నార్ ఆడుతుంటే.. గొంతకట్టేది.. కూడా ఏఎన్నారే అన్నట్లుగా ఉండేవి ఆ పాటలు. కథానాయకుల బాడీలాంగ్వేజ్​కు తగ్గట్టుగా ధ్వన్యనుసరణ చేసి.. వారిని ఆవహించినట్లుగా ఆలపించడం ప్రపంచ చరిత్రలో నీవు తప్ప మరే గాయకుడూ చేసిన దాఖలా లేదు. ఒక్క ఎస్పీబీకి మాత్రమే అది సాధ్యమైంది. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, జననీ జన్మభూమీశ్చ అంటూ.. పుణ్యభూమి నాదేశం నమో నమామీ అంటూ ఎన్టీఆర్ తెరపై కనిపిస్తుంటే.. వాటికి గళం ఇచ్చింది బాలూ అన్న ధ్యాసకూడా ఎవరికీ రాలేదు. నేను పుట్టాను లోకం నవ్వింది… డోన్ట్ కేర్ అని ఏఎన్నార్ అంటే… దాని వెనుక బాలూ ఉన్నాడని ఎవరికీ అసలు ఆలోచనే రాదు. పాటల అవకాశాలకోసం నిరీక్షించే పరిస్థితి నుంచి బయటపడి సంగీత దర్శక, నిర్మాతలను, కథానాయకులను మీ పాటకోసం నిరీక్షించే పరిస్థితిని సృష్టించుకున్నారు.

“ప్రియతమా… నా హృదయమా” అంటూ బాలు గుండెల్లో నుంచి వచ్చిన పాటతో.. ప్రేమికుల హృదయాలు ఉప్పొంగాయి. “ప్రేమ ఎంత మధురం…” అంటూ పాడిన గీతంతో భగ్నప్రేమికులు తమను తాము చూసుకున్నారు. తొలినాళ్లలో కథానాయకుల గొంతులను అనుసరించిన మీ పాట.. ఏ విధమైన ఇమేజ్, లేని కొత్త హీరోలకూ అంతే నప్పింది. 90లలో మీరు పాడిన ప్రేమగీతాలు.. లక్షల్లో క్యాసెట్ల ‘రికార్డులకెక్కి’ రికార్డులు సృష్టించాయి. 50 ఏళ్లుగా పాడుతున్నా.. ఆ గళంలో ఫ్రెష్​నెస్ ఏమాత్రం తగ్గలేదు. ఆ గొంతు అప్పట్లో ఎలా ఉందో.. ఇప్పుడూ అంతే..! ఈ మధ్య మీరు శర్వానంద్ కు పాడిన “నిలువదే మరి నిలువదే ” పాటను విన్నా…. పలాస సినిమాలో కొత్తబ్బాయి కరుణాకర్​కు పాడిన సొగసరి పాట చూసినా.. కొన్ని నెలల కిందటే వచ్చిన డిస్కో రాజాలో “నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో” పాట విన్నా… 80లలో బాలుకు.. ఇప్పటి బాలుకూ ఏం తేడా లేదు. సేమ్ టూ సేమ్. అందుకే బాలూ అంటే బాలూనే .. ఎవర్ గ్రీన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This