‘సంగీత ప్రపంచంలో ఘంటసాల సూర్యుడైతే.. బాలు చంద్రుడు’

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం… ఓ సంగీత సంద్రం. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన స్వర ప్రయాణంలో మూడు తరాలతో కలిసి పనిచేశారు. పాటే ప్రపంచంగా బతికిన ఆయనతో 54 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగించారు ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్​. బాలు ఆర్కెస్ట్రాలో సభ్యుడిగా, సంగీత దర్శకుడిగా, కుటుంబ సన్నిహితుడిగా చాలా దగ్గర్నుంచి చూశారు మాధవపెద్ది సురేశ్​. ఈ సందర్భంగా బాలుతో ఆయనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

“సంగీతం పరంగా చెప్పాలంటే మాధవపెద్దిలో మధ్యమం ఉంది. పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంలో పంచమం ఉంటుంది. సరిగమపదనిలో మధ్యమం దగ్గరే పంచమం ఉంటుంది. మా ఇద్దరి అనుబంధం అలాంటిదే. నన్ను 1974లో చలపతిరావు ‘పరివర్తన’ సినిమాతో వాద్య కళాకారుడిగా పరిచయం చేశారు. ఆ రికార్డింగ్‌ పాడింది బాలుగారే. 1989లో నేను సంగీత దర్శకుడినయ్యాక నేను స్వరపరిచిన ‘ఇది సరిగమలెరుగని రాగము…’ (హై హై నాయకా) పాట పాడిందీ ఆయనే. వాద్య కళాకారుడిగా నేనెక్కడికి వెళ్లి ఏ పాటలు వాయించినా 98 శాతం బాలు పాడేవే. ‘శంకరాభరణం’ మొదలుకొని ఎన్నో సినిమాలకు కీ బోర్డ్‌ ప్లేయర్‌గా పనిచేశా. 1975 నుంచి బాలు ఆర్కెస్ట్రా బృందంలో కీ బోర్డ్‌ ప్లేయర్‌గా 12 ఏళ్లు పనిచేశా. మొదటిసారి 1979లో అమెరికా వెళ్లాం. అక్కడ్నుంచి ఎన్నో దేశాలు తీసుకెళ్లారు. సంగీత కచేరీల కోసం వేరే దేశాలకు వెళ్లినప్పుడు అక్కడున్న వింతలు, విశేషాల్ని మాకు చూపించకుండా తీసుకొచ్చేవారు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న స్నేహితులంతా నా స్నేహితులే. మా అన్నయ్య మాధవపెద్ది రమేశ్​ నా జీవితంలో ఎంత ముఖ్యమో. బాలు గారు అంత ముఖ్యం. బాలు తల్లిదండ్రులూ నన్ను వాళ్ల అబ్బాయిగానే చూసుకున్నారు” అని తెలిపారు మాధవపెద్ది సురేశ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This