సోనూసూద్​ సాయం కోరిన భాజపా ఎమ్మెల్యే!

లాక్​డౌన్​లో చిక్కుకున్న వలస కార్మికుల కష్టాలను తీర్చిన సోనూసూద్​ పేరు ఇప్పడు దేశవ్యాప్తంగా సుపరిచితమే. వలస జీవులు స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సుల ఏర్పాటు చేశాడు. తనకు సాయం చేయమని కోరిన వారందిరకీ.. కాదనకుండా చేయూతనిచ్చాడు. అయితే.. ఓ భాజపా సీనియర్​ నేత, రాష్ట్ర అధికార పార్టీ ఎమ్మెల్యే సోనూ సాయం కోరారు. ఆయనకి ఒక యాక్టర్​ సహాయం ఎందుకు అవసరమైందో తెలుసుకుందాం..

భాజపా నాయకుడు, మధ్యప్రదేశ్​ మాజీ మంత్రి, ప్రస్తుతం రేవా నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేంద్ర శుక్లా.. సోనూసూద్​ సహాయం కోరారు. ముంబయిలో చిక్కుకుపోయిన తన ప్రాంత వలస కార్మికులు స్వస్థలానికి చేరేలా చూడాలని ట్విట్టర్​ వేదికగా విజ్ఞప్తి చేశారు. ముంబయిలో చిక్కుకున్న మధ్యప్రదేశ్​లోని రేవా, సాంట్నా జిల్లాలకు చెందిన 168 మంది వలస కార్మికుల జాబితాను ఈ ట్వీట్​కు జత చేశారు శుక్లా.

సానుకూల స్పందన..

భాజపా నేత వినతికి సానుకూలంగా స్పందిచాడు సోనూసూద్​. ‘మీ ప్రాంత వలస కార్మికులను రేపు స్వస్థలానికి పంపుతాను. ఈసారి ఎప్పుడైనా నేను మధ్యప్రదేశ్​ వస్తే.. పోహా తినిపించండి’ అంటూ ట్వీట్​ చేశాడు.

ఆ తర్వాత తన విజ్ఞప్తికి సోనూ సానుకూలంగా స్పందించారని.. 168 మందిలో 55 మంది మధ్యప్రదేశ్​ చేరుకుంటారని తెలిపారు భాజపా నేత.

సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్​..

సోనూసూద్​ను ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే సాయం కోరటంపై సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్స్​ వర్షం కురిపించారు నెటిజన్లు. ‘కేంద్రంలో, మధ్యప్రదేశ్​లో భాజపానే అధికారంలో ఉంది, కానీ వారి నాయకుడు ఒక బాలీవుడ్​ యాక్టర్​ సాయం కోరాడు’ అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్​ విమర్శలు..

ఇదే అదునుగా తీసుకున్న కాంగ్రెస్..​ మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది.

రాజేంద్ర శుక్లా ట్వీట్​లో మధ్యప్రదేశ్​లోని చేదు నిజాలు వెల్లడయ్యాయి. మాజీ మంత్రి, ప్రస్తుత రేవా నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అయి ఉండి మీ ప్రభుత్వాన్ని నమ్మటం లేదు. అందుకే ముంబయిలోని వలస కార్మికులను తీసుకొచ్చేందుకు యాక్టర్​ సోనూసూద్​ సాయం కోరారు.

– అరుణ్​ యాదవ్​, కాంగ్రెస్ నేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This