కాంగ్రెస్​లో సమూల‌ ప్రక్షాళన! ఆజాద్​ పదవులకు కోత

వరుస ఓటములు, అంతర్గత సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌లో సమూల ప్రక్షాళనకు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉపక్రమించారు. పలువురు సీనియర్లను పదవుల నుంచి తప్పించారు. పార్టీ అధినాయకత్వంపై లేఖాస్త్రం సంధించిన అగ్రనేతల్లో ముఖ్యుడైన గులాం నబీ ఆజాద్‌ ప్రాధాన్యాన్ని తగ్గించేశారు. ఆయన పదవులకు కోత పెట్టారు. కీలక నిర్ణయాల విభాగం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)నీ సోనియా పునర్‌వ్యవస్థీకరించారు. ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జులను మార్చివేశారు. పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీని ఏర్పాటు చేశారు. సంస్థాగత వ్యవహారాల్లో తనకు సహాయం అందించేందుకు ఆరుగురు నేతలతో కమిటీని నియమించారు. పార్టీ ఉత్తర్‌ప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ప్రియాంకా గాంధీకి పూర్తి బాధ్యతలు అప్పగించారు. పార్టీ పగ్గాలు క్రియాశీల నేతకు ఇవ్వాలంటూ గత నెలలో 23 మంది సీనియర్‌ నేతలు లేఖ రాయడం, 24న నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించడంతోనే పార్టీ విభాగాల్లో మార్పులుంటాయనే ప్రచారం జోరందుకుంది.

నాటి సమావేశంలో సీనియర్లపై విమర్శలు వెల్లువెత్తినా సంపూర్ణ అధికారం పార్టీ అధ్యక్షురాలికే సమావేశం కట్టబెట్టింది. ఈ క్రమంలో సోనియాగాంధీ శుక్రవారం రాత్రి సీడబ్ల్యూసీతో పాటు పలు విభాగాల్లో మార్పులు చేర్పులు చేశారు.

సీడబ్ల్యూసీకే ఆజాద్‌ పరిమితం..

22 మంది శాశ్వత సభ్యులతో ఉండే సీడబ్ల్యూసీలో నలుగురిని తొలగించి కొత్తగా నలుగురిని తీసుకున్నారు. లేఖాస్త్రాన్ని సంధించిన సీనియర్లలో ముఖ్యుడైన గులాంనబీ ఆజాద్‌ను సీడబ్ల్యూసీకి పరిమితం చేశారు. ప్రధాన కార్యదర్శి, హరియాణా ఇన్‌ఛార్జి పదవుల నుంచి ఆయనను తప్పించారు. శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, జితేంద్రసింగ్‌, తారిఖ్‌ అన్వర్‌, రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలాను సీడబ్ల్యూసీ సభ్యులుగా నియమించారు. పశ్చిమ్‌ బెంగాల్‌ పీసీసీ అధ్యక్షునిగా నియమితులైన అధీర్‌ రంజన్‌ చౌధురిని సీడబ్ల్యూసీ సభ్యుడి హోదా నుంచి శాశ్వత ఆహ్వానితుడిగా బదిలీ చేశారు. వయోభారం, ఇతర కారణాలతో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మోతీలాల్‌ వోరా, తామ్రధ్వజ్‌ సాహు, గోవా మాజీ ముఖ్యమంత్రి లిజినో ఫెలిరోలను సీడబ్ల్యూసీ నుంచి తప్పించారు. సీడబ్ల్యూసీలో గతంలో 16 మంది శాశ్వత ఆహ్వానితులుగా ఉండగా ఆ సంఖ్యను 26కు పెంచారు. గతంలో శాశ్వత ఆహ్వానితుల జాబితాలో ఉన్న గౌరవ్‌ గొగోయి, పి.సి.చాకో, ఆశా కుమారి, ఆర్‌.సి.కుంతియా, అనురాగ్‌ నారాయణ్‌ సింగ్‌లను తొలగించారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి కె.హెచ్‌.మునియప్పను తాజాగా శాశ్వత ఆహ్వానితునిగా నియమించారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో 9 మందిని నియమించగా అందులో కొత్తగా కుల్‌దీప్‌ బిష్ణోయ్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ చోటు దక్కించుకున్నారు. ఐఎన్‌టీయూసీ అంతర్జాతీయ అధ్యక్షుడి హోదాలో ప్రత్యేక ఆహ్వానితునిగా జి.సంజీవరెడ్డిని కొనసాగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This