అత్యున్నత క్రీడా పురస్కారానికి పంచ ‘ఖేల్‌’రత్నాలు

ఖేల్‌రత్న కోసం సాధారణంగా ఏడాదికి ఒకరిని లేదా ఇద్దరిని మాత్రమే ఎంపిక చేస్తారు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ తర్వాత ముగ్గురికి, 2016 రియో ఒలింపిక్స్‌ తర్వాత అత్యధికంగా నలుగురికి ఖేల్‌రత్న దక్కింది. ఈసారి కమిటీ ఐదుగురు పేర్లను క్రీడల శాఖకు సిఫారసు చేయడం విశేషం.

  • స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌శర్మ, రెజ్లింగ్‌ ఛాంప్‌ వినేశ్‌ ఫొగాట్‌, మహిళల హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌, టీటీ కెరటం మనిక బాత్రా, రియో పారాలింపిక్స్‌లో హైజంప్‌లో పసిడి గెలిచిన మరియప్పన్‌ తంగవేలు క్రీడల శాఖకు అందజేసిన జాబితాలో ఉన్నారు.
  • స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌తో పాటు.. ప్రపంచ అండర్‌-20 ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా, పరుగులో ప్రపంచ అండర్‌-20 ఛాంపియన్‌ హిమదాస్‌కు నిరాశ తప్పలేదు.
  • మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, హాకీ మాజీ కెప్టెన్‌ సర్దార్‌సింగ్‌, మాజీ పారా అథ్లెట్‌ దీపా మలిక్‌ తదితరులు కమిటీలో సభ్యులు. అర్జున అవార్డు కోసం 29 మంది క్రీడాకారులతో కమిటీ జాబితాను సిద్ధం చేసింది.

ద్రోణాచార్యను 13 మందికి, ధ్యాన్‌చంద్‌ అవార్డును 15 మందికి ఇవ్వాలని కమిటీ సిఫారసు చేసింది. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆమోదం లభించాక ఆగస్టు 29న (జాతీయ క్రీడల దినోత్సవం) జరిగే కార్యక్రమంలో అవార్డులను అందజేస్తారు. కరోనా నేపథ్యంలో ఈసారి అవార్డుల కార్యక్రమం వర్చువల్‌గా జరగనుందని సమాచారం.

రోహిత్‌ నం.4:

ఒక క్రికెటర్‌ ఖేల్‌రత్న గెలుచుకోవడం ఇది నాలుగోసారి మాత్రమే. అతనికన్నా ముందు సచిన్‌ తెందుల్కర్‌ (1998), మహేంద్రసింగ్‌ ధోనీ (2007), విరాట్‌ కోహ్లీ (2018) ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారత క్రికెట్లో కీలక ఆటగాడైన 33 ఏళ్ల రోహిత్‌ గతేడాది అసాధారణంగా రాణించాడు.

2019 వన్డే ప్రపంచకప్‌లో 5 శతకాలు సహా 648 పరుగులు సాధించి సత్తా చాటాడు. అర్జున అవార్డు తుది జాబితాలో పేసర్‌ ఇషాంత్‌శర్మ కూడా చోటు సంపాదించాడు. 31 ఏళ్ల ఇషాంత్‌ ఇప్పటిదాకా 97 టెస్టులు, 80 వన్డేలు ఆడి 400పైన అంతర్జాతీయ వికెట్లు సాధించాడు.

సాత్విక్‌ శ్రమకు ఫలితం

గత కొన్నేళ్లుగా సత్తా చాటుతున్న యువ షట్లర్‌, తెలుగుతేజం సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌శెట్టికు తాజాగా అర్జున అవార్డుతో బహుమానం లభించింది. గతేడాది థాయ్‌లాండ్‌ ఓపెన్‌ను గెలుచుకున్న ఈ ద్వయం ఒక సూపర్‌ సిరీస్‌ సాధించిన భారత తొలి పురుషుల డబుల్స్‌జోడీగా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ ఫైనల్‌ చేరింది.

ఉషకు ధ్యాన్‌చంద్‌ అవార్డు:

విశాఖకు చెందిన మాజీ బాక్సర్‌ ఉష ధ్యాన్‌చంద్‌ అవార్డుకు ఎంపికైంది. ప్రస్తుతం ఆమె తూర్పు కోస్తా రైల్వే లోకోషెడ్‌లో విధులు నిర్వహిస్తోంది. తన కెరీర్‌లో ఉష ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, జాతీయస్థాయి పోటీల్లో 12 పతకాలు సాధించింది. ప్రస్తుతం ఆమె భారత మహిళా బాక్సింగ్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తోంది.

వినేశ్‌కు ఎట్టకేలకు:

మరోవైపు 2016 రియో ఒలింపిక్స్‌లో గాయంతో బాధాకర రీతిలో నిష్క్రమించిన వినేశ్‌ ఫొగాట్‌కు శ్రమకు తగ్గ ఫలితం లభించింది. 2018 కామన్వెల్త్‌ క్రీడలు, 2019 ఆసియా క్రీడల్లో పసిడి పతకాలతో మెరిసిన ఈ రెజ్లర్‌.. 2019 ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ కాంస్యం సాధించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This