రిజిస్ట్రేషన్​ శాఖ పునర్​వ్యవస్థీకరణ… మెరుగైన సేవలే లక్ష్యం

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళన కార్యక్రమం మొదలవటం వల్ల ఇవాళ్టి నుంచి పూర్తిగా రిజిస్ట్రేషన్లు ఆపేశారు. కొత్తగా తెస్తున్న రెవెన్యూ చట్టానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ శాఖను కూడా పునర్‌ వ్యవస్థీకరణ చేయనుంది. అందులో భాగంగా… రెవెన్యూ శాఖనే ఇకపై వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేయనుండగా.. వ్యవసాయేతర భూములు, భవనాలు, వివాహాలు వంటి రిజిస్ట్రేషన్లకే రిజిస్ట్రేషన్ల శాఖ పరిమితం కానుంది.

రాష్ట్రంలో 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా… అందులో 20కి పైగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూములే అధికంగా రిజిస్ట్రేషన్‌ అవుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వాటిని పూర్తిగా రద్దు చేసి…ఆ కార్యాలయాలను స్థిరాస్థి క్రయవిక్రయాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేయడమా….లేక అక్కడి సిబ్బందిని పని ఒత్తిడి అధికంగా ఉన్న సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సర్దుబాటు చేయడమా అన్న అంశంపై రిజిస్ట్రేషన్‌ శాఖ కసరత్తు చేస్తోంది.

ఇప్పటి వరకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి…ఎంత ఆదాయం వచ్చిందన్న విషయాన్ని పరిశీలిస్తే… ఆగస్టు చివరి వరకు 4.57లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ జరగ్గా రూ.2954 కోట్లు రాబడి వచ్చింది. ఈ నెలలో ఇప్పటి వరకు 22,469 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ జరిగి రూ.156.01 కోట్లు ఆదాయం వచ్చింది. మొత్తం మీద ఈ ఆర్థిక ఏడాది ఇప్పటి వరకు 4.95 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగి రూ.1475.54 కోట్లు, ఈ స్టాంపుల విక్రయం ద్వారా రూ.1634.69 కోట్లు మొత్తం రూ.3110.25 కోట్లు రాబడి వచ్చింది. ప్రక్షాళన జరిగితే ఆదాయం తగ్గే అవకాశాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ఆర్థిక ఏడాదిలో నిర్దేశించిన లక్ష్యం మేరకు పదివేల కోట్లు రాబడి రాకపోవచ్చని, పని ఒత్తిడి తగ్గడంతోపాటు….పారదర్శకత పెరిగి పౌరులకు వేగవంతమైన, మెరుగైన సేవలు రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి అందుతాయని స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This