హైదరాబాద్​ వర్సెస్ బెంగళూరు: ‘ఈ సాలా’ అయినా??

‘ఈ సాలా కప్ నమదే’… సోషల్ మీడియాలో ఈ నినాదంతో ఏటా వారి ఐపీఎల్ ప్రస్థానం మొదలవడం పరిపాటి. లీగ్ దశ చివరకు వచ్చేసరికి మాత్రం వారి లెక్కలే వేరుగా ఉంటాయి. ‘చెన్నై ముంబయిని ఓడించి, పంజాబ్ హైదరాబాద్​ను ఓడించి, మనం కేకేఆర్​పై భారీ తేడాతో గెలిస్తే ప్లే-ఆఫ్​కు సులభంగా చేరిపోతాం’ ఈ విధంగా వ్యూహాలను సవరించుకోవడమూ ఆనవాయితీయే.

ఈ పాటికే ఆ జట్టు ఏంటో అర్థమైపోయి ఉంటుంది. నేటి(సెప్టెంబరు 21) నుంచి ఆ జట్టు తన ఐపీఏల్ ప్రస్థానాన్ని ప్రారంభిస్తోంది. అది తలపడబోయే జట్టు మాత్రం అందుకు భిన్నం. ఏమాత్రం హడావిడి ఉండదు. కూల్​గా ఉంటారు. సైలెంట్ కిల్లర్స్​గా పని పూర్తిచేస్తారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో తిరుగేలేదు. ఈ సీజన్ మూడో మ్యాచ్ ద్వారా తమ టైటిల్ వేటను షురూ చేస్తున్నాయి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , సన్​రైజర్స్ హైదరాబాద్.

ఐపీఎల్​లో ముంబయి-చెన్నై పోరు… భారత్-పాక్ అంత అంచనాలు పెంచేది అయితే.. ఆర్సీబీ-హైదరాబాద్​ మ్యాచ్​ను యాషెస్​తో పోల్చినా అతిశయోక్తి కాదేమో. జట్ల వ్యక్తిగత రికార్డులు ఎలా ఉన్నప్పటికీ, ఒకటితో ఒకటి తలపడితే మాత్రం నువ్వా నేనా అన్నట్టు సాగడం ఖాయం. గత రికార్డులే అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. 2013లో హైదరాబాద్​ జట్టు ఏర్పడిన దగ్గర నుంచి ఆర్సీబీతో 15 మ్యాచ్​లు ఆడితే… హైదరాబాద్ 8, బెంగళూరు 6 కైవసం చేసుకుంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2016 ఫైనల్​లో తలపడినప్పుడు సన్​రైజర్స్ టైటిల్ ఎగరేసుకుపోయింది.

ఆ ఫైనల్ ను, 2017లో రద్దయిన ఒక్క మ్యాచ్ మినహాయిస్తే.. 2013, 14, 15, 16, 18, 19 లీగ్ దశలో ఉండే రెండు మ్యాచ్ లను చెరొకటి గెలుచుకున్నాయి. అంటే ఎప్పటి ప్రతీకారం అప్పుడే తీర్చేసుకుంటున్నాయన్నమాట. ఆ ప్రకారం చూస్తే నేటి పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This