సచిన్​ వందో సెంచరీ.. రైనాతో ఆసక్తికర వ్యాఖ్యలు

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనా, అతడు ‘పాజీ’ అని అభిమానంగా పిలిచే దిగ్గజ సచిన్​ తెందుల్కర్​కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. సందర్భానుసారం మాస్టర్​​పై తన ప్రేమను చాటిచెప్పే రైనా.. ఇటీవల ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.​ 100వ సెంచరీ చేసిన తర్వాత సచిన్ తనతో చెప్పిన మాటలను ఓ క్రీడా మ్యాగజైన్​కు తెలిపాడు.

“పాజీ 100వ శతకం సాధించేటప్పుడు మరో ఎండ్​లో నేను ఉన్నా. సింగిల్​ తీసి సచిన్ సెంచరీ చేసిన తర్వాత ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను. ఈ శతకం చాలా కాలంగా బాకీ ఉందని అన్నాను. అప్పుడు ఆయన.. ‘ఈ క్షణం కోసం ఎదురుచూస్తూ నా జుట్టు నెరసిపోయింది’ అని నాతో చెప్పారు”

– సురేశ్ రైనా, భారత మాజీ క్రికెటర్

ఆ క్షణంలో సచిన్​ ఎంత మానసిక భారాన్ని మోస్తున్నారో అర్థమైందని రైనా అన్నాడు. మాస్టర్​తో ఉన్న తీపి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.

“భారత్​ కోసం ఆడటం ప్రారంభించాక పాజీతో నాకు చాలా మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అందులో 2011 ప్రపంచకప్​ సహా ఆస్ట్రేలియాలో (2008) సీబీ సిరీస్, న్యూజిలాండ్ పర్యటన(2008-09), టెస్టుల్లో నెం.1గా జట్టుగా నిలవడం ఎన్నటికీ మరచిపోను”

– సురేశ్ రైనా, భారత మాజీ క్రికెటర్

2014 ఇంగ్లాండ్​ పర్యటనకు ముందు తనను సచిన్​ ఎంతగా ప్రభావితం చేశారో రైనా వెల్లడించాడు. రెండు వారాల పాటు మాస్టర్​ ఆధ్వర్యంలో తీసుకున్న శిక్షణ, తనలో ఎంతో ఉత్సాహం నింపిందని చెప్పాడు. “నిన్ను నువ్వు నమ్మాలి. అప్పుడే అద్భుతాలు సాధిస్తావు” అని సచిన్​ మాటలతో స్ఫూర్తి పొందిన రైనా.. తన చేతిపై ‘బిలీవ్’​ టాటూ కూడా వేయించుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This