విపత్తులను ఎదుర్కోవడంలో నేర్వాల్సిన పాఠాలెన్నో..

బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడ్డ వాయుగుండంతో కురుస్తున్న భారీ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాలకు తుపానులు కొత్తేమీ కాదు. తరచూ విరుచుకుపడుతున్న తుపానులతో ఏర్పడే విపత్తులు, భారీ ఆస్తి నష్టం కలిగిస్తున్నాయి. అవి తీర రక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు, నష్ట ప్రభావాన్ని తగ్గించేందుకు తీరంలోని పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వ వ్యవస్థల ప్రణాళికలు దీర్ఘకాలంగా కార్యాచరణకు నోచుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆరేళ్ల క్రితం అక్టోబర్‌ 13న తీరందాటి, తూర్పు కోస్తాతీరంపై విరుచుకుపడిన ‘హుద్‌హుద్‌’- గత వందేళ్లలోనే విధ్వంసకరమైన మహా తుపాను అని వాతావరణ నిపుణుల అంచనా. అది పట్టణ ప్రాంతాలను తాకి అత్యధిక నష్టం కలిగించింది. హుద్‌హుద్‌ అనుభవాలతో తీరరక్షణకు పటిష్ఠమైన దీర్ఘకాలిక కార్యాచరణను అమలు చేయడంలో ప్రభుత్వ వ్యవస్థలు విఫలమయ్యాయనే చెప్పాలి. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం, వాతావరణంలో పెనుమార్పులవల్ల తలెత్తే విపత్తులను మానవాళి ఎదుర్కోవడం అసాధ్యం. అయితే ముందస్తు ఏర్పాట్లతో నష్టప్రభావాలను తగ్గించే అవకాశాలు మెండుగా ఉంటాయన్న సంగతి విస్మరించకూడదు.

విధ్వంసంతో అపార నష్టం

మన దేశం భూభాగం వెంట 7,500 కి.మీ. మేర సముద్రతీర ప్రాంతం విస్తరించి ఉంది. తీరానికి 50 కి.మీ.లోపు 25 కోట్ల మేర జనాభా ఉంది. తీర ప్రాంతంలో విస్తరించిన మడ అడవులు, ఉప్పునీటి కయ్యలు, చిత్తడి నేలలతోపాటు అనేక రకాల ఇసుక నేలల్లో విశిష్టమైన జీవవైవిధ్య సంపద ఉంది. జనాభా పెరుగుదల, నగరీకరణ, అభివృద్ధి పేరిట తీరంలో విచ్చలవిడిగా సాగుతున్న నిర్మాణాలు, పరిశ్రమలు, ఓడరేవుల ఏర్పాటు వల్ల జీవవైవిధ్యంపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. తీరప్రాంతం ఎన్నో విపత్తులకూ కేంద్రబిందువుగా మారుతోంది. 1800-2000 మధ్య కాలంలో దేశంలో 320 తుపానులు ఏర్పడగా వాటిలో 110 వరకు తీవ్ర నష్టం కలిగించాయి. కోస్తా తీరంలో దివిసీమ (1977), కోనసీమ (1997), ఒడిశా (1999) తుపానులతోపాటు హుద్‌హుద్‌, తిత్లీ వంటివి తీరం వెంబడి ఉన్న ప్రాంతాలను విపరీతంగా దెబ్బతీశాయి. 2004 నాటి సునామీ దేశ తీరప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. చరిత్రలో ప్రపంచంలో అత్యంత ఘోరమైన పది తుపానుల్లో కాకినాడ తీరం కోరింగ ఓడరేవు ప్రాంతంలో 1839లో ఏర్పడినది ఒకటిగా చెబుతారు. అప్పట్లో మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This