భారీ వర్షాలతో పొలాలు నీటిపాలు.. ఆందోళనలో రైతులు

అధిక వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. కుండపోతగా కురిసిన ప్రాంతాల్లో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అంచనా. గోదావరి, కృష్ణా నదులు, వాగులకు వరద రావడం, చెరువులు కట్టలపై నుంచి పొంగి పొర్లడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,750 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు వ్యవసాయశాఖ పరిశీలనలో తేలింది. పత్తి, కంది, వరి తదితర పంటలు నీటమునిగి.. మొక్కలు ఎర్రబారి చనిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పంట నష్టం ఇలా..

  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో లక్షా 70 వేల ఎకరాల్లో పంట నీట మునిగిందని జిల్లా అధికారులు తెలిపారు.
  • పెద్దపల్లి జిల్లాలో 33 గ్రామాల్లో 2,211 ఎకరాల వరిపైరు నీట మునిగింది.
  • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 26,049 మంది రైతులకు చెందిన 27,894 ఎకరాలు నీట మునిగింది. ఇందులో 17,920 ఎకరాలు 33 శాతానికి పైగా దెబ్బతిన్నాయి.
  • కరీంనగర్‌ జిల్లాలో 168 గ్రామాల పరిధిలో 13,570మంది రైతులకు చెందిన పంటకు నష్టం వాటిల్లింది. అధికారులు క్షేత్రస్థాయిలో అంచనా వేసి మొత్తంగా 24,803 ఎకరాల్లో పంట నష్టపోయిందని తేల్చారు.
  • పొలాల నుంచి నీరు బయటికి వెళ్లిన తర్వాత నష్టం అంచనా వేస్తామని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు.

తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలి

నీటిలో మునిగిన పైర్లకు తెగుళ్లు సోకి దెబ్బతినే ప్రమాదముందని.. వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచించింది. వరికి తెగుళ్లు రాకుండా లీటరు నీటిలో గ్రాము కార్బండిజం కలిపి చల్లాలని తెలిపింది. ‘నీటిలో మునిగిన పత్తి మొక్కలు ఎర్రబారి చనిపోతుంటాయి. 19:19:19 కాంప్లెక్స్‌ ఎరువును లీటరు నీటిలో 10 గ్రాముల చొప్పున కలిపి చల్లాలి. వర్షాలు ఆగిన తర్వాత ఎకరానికి 35 కిలోల వరకు యూరియా వేయాలి’ అని జయశంకర్‌ వర్సిటీ ప్రధాన పత్తి శాస్త్రవేత్త ఎ.సుదర్శనం వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This