‘భారత్​ది ప్రకృతితో మమేకమై జీవించే సంస్కృతి’

ప్రాచీన కాలం నుంచి ప్రకృతిని కాపాడటమే కాకుండా, దానితో మమేకమై జీవించే సంస్కృతి భారతదేశానికి ఉందని ఐక్యరాజ్య సమితి వేదిగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ పేర్కొన్నారు. ఐరాస నిర్వహించిన జీవవైవిధ్య శిఖరాగ్ర సదస్సులో మాట్లాడారు.

పకృతి వనరుల దోపిడీ, అస్థిరమైన ఆహారపు అలవాట్లు, వినియోగ విధానాలు.. మానవ మనుగడకు ఉపయోగపడే వ్యవస్థను నాశనం చేస్తాయని పేర్కొన్నారు జావడేకర్. ఈ విషయాన్ని కొవిడ్ మహమ్మారి నిరూపించిందన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భారత ప్రగతిని వివరించారు.

“ప్రకృతి రక్షతి రక్షితః అని మా వేదాలు చెబుతాయి. అంటే ప్రకృతిని రక్షిస్తే, ప్రకృతి తిరిగి మనల్ని రక్షిస్తుందని అని అర్థం. గత దశాబ్ద కాలంలో దేశంలో అడవుల శాతాన్ని 24.56 శాతానికి భారత్ పెంచగలిగింది. ప్రపంచంలోని వన్య పులులలో అత్యధికం భారత్​లోనే ఉన్నాయి. వీటి సంఖ్య రెట్టింపైంది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని 2022 గడువుకు ముందే సాధించాం.”

-ప్రకాశ్ జావడేకర్, పర్యావరణ శాఖ మంత్రి

దేశంలో 2.6 కోట్ల హెక్టార్ల అటవీ నిర్మూలన భూమిని పునరుద్ధరించి.. 2030 నాటికి భూక్షీణతను స్థిరీకరించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐరాసకు తెలిపారు జావడేకర్. 2021లో జరగనున్న జీవ వైవిధ్య కన్వెన్షన్(సీబీడీ) సభ్యదేశాల(సీఓపీ) 15వ సమావేశంలో రూపొందించుకునే పోస్ట్​-2020 గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్​వర్క్​.. ప్రకృతిని రక్షించుకునేందుకు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జీవవైవిధ్యాన్ని కాపాడటంలో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని స్పష్టం చేశారు జావడేకర్. సంవత్సరం వ్యవధిలోనే రెండు కాన్ఫరెన్స్​ ఆఫ్ పార్టీస్(సీఓపీ) సమావేశాలను నిర్వహించిందన్నారు. సుస్థిర జీవన విధానం, హరితాభివృద్ధి నమూనా ద్వారా పర్యావరణ పరిరక్షణలో భారత్​ విజేతగా నిలుస్తోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This