కాలుష్యం కాటుకు నీరే గరళం!

ప్రకృతి వనరుల్లో గాలి తరవాత నీరే వేగంగా కలుషితమవుతోంది. భూమిపై ఉన్న నదులు, కాలువలు, సరస్సులు, చెరువులు, ఏరులతోపాటు భూగర్భ జలాలూ కాలుష్యం బారిన పడుతున్నాయి. ఇప్పటికే 60 శాతం నీటి వనరులు కలుషితమయ్యాయి. ఈ పరిస్థితిని నియంత్రించకపోతే ఈ పరిస్థితిని నియంత్రించకపోతే 2050 నాటికి భూమ్మీద నీరంతా గరళమవుతుందని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే 60 శాతం నీటి వనరులు కలుషితమయ్యాయి. నీరు తన సహజ స్వభావాన్ని కోల్పోయి రసాయనిక, భౌతిక మార్పులు చెందడమే కాలుష్యం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో చోటుచేసుకున్న అంతుచిక్కని వ్యాధి ఉదంతానికి నీటి కాలుష్యమే కారణమని నిపుణులు తేల్చారు. నీటిలో మోతాదుకు మించి రసాయనాలు, లోహ అవశేషాలు ఉండటాన్ని గుర్తించారు. బొద్దింకలు, దోమలు ఇతర కీటకాలను చంపే రసాయనాల్లో వినియోగించే విషప్రభావం ఉండే రసాయన అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవేకాకుండా సీసం, నికెల్‌ వంటి లోహాలూ ఆందోళనకర స్థాయిలో ఉండటం గమనార్హం.

జల సంరక్షణలో మనమెక్కడ..

‘ఓషన్‌ ఇండెక్స్‌ హెల్త్‌’ బృందం 2013లో 171 దేశాల్లో చేపట్టిన ఓ సర్వే ప్రకారం.. జల సంరక్షణలో రష్యా ప్రథమ స్థానంలో నిలవగా భారత్‌ 162వ స్థానానికి పరిమితమైంది. దేశంలో నీటి కాలుష్యానికి చాలా కారణాలనేకం. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వ్యవసాయ రసాయనాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు ప్రధాన కారకాలు. ఒకప్పుడు కాలువల ద్వారా వచ్చే నీటితో పంట చేలల్లో చేపలు ఎగసిపడేవి. అధిక మోతాదులో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకంతో నీరు విషతుల్యమై చేలల్లో మచ్చుకైనా చేపలు కానరావడం లేదు. నీటిలో ఉండే నత్తలు, జలగలు, ఏలిక పాములు వంటి ఎన్నో జీవులు ఈ గరళం ధాటికి కనుమరుగై పోతున్నాయి. చేలల్లో రసాయన జలాలు నదుల్లోకి, నదుల్లో కలుషితమైన నీరు పొలాల్లోకి చేరి నీటి విషగాఢతను పెంచుతున్నాయి. ఈ నీటిని వినియోగించిన జీవులు, మొక్కల్లో చేరి అవి అందించే ఆహార పదార్థాల్లో విషాలుగా మారి దుష్ప్రభావాలను కలగజేస్తున్నాయి. చాలాచోట్ల తోళ్లు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, ప్లాస్టిక్‌, ఇంధనాలు, బ్యాటరీ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా యథేచ్ఛగా నదుల్లో వదులుతున్నారు. నగరాలే కాదు… గ్రామాల్లో సైతం మురుగు నీటిని మురికి కాలువల ద్వారా నదీజలాల్లో కలిపేస్తున్నారు. పారిశుద్ధ్య వ్యర్థాలు నీటి వనరుల గట్ల మీదే తాండవిస్తూ నిరంతరాయంగా నీటిలో కలిసి పోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This