చోరీ సొత్తులో… రాబట్టింది సగమే!

పోలీసులు స్వాధీనం చేసుకుంది రూ.319.63 కోట్లే

రాష్ట్రంలో దోపిడీలు, దొంగతనాలు, కొల్లగొట్టడాలు తదితర నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న సొత్తులో సగమే స్వాధీనం అవుతోంది. అసలు కొన్ని కేసుల్ని ఛేదించలేక పోలీసులు చేతులెత్తేస్తుండగా…. మరికొన్నింటిలో నిందితుల్ని పట్టుకుంటున్నప్పటికీ వారు దోచుకున్న సొమ్మును పూర్తి స్థాయిలో రికవరీ చేయలేకపోతున్నారు. ప్రధానంగా పెద్ద మొత్తాల్లో దోచుకెళ్లే అంతర్రాష్ట్ర ముఠాల నుంచి రికవరీలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో 2014 నుంచి 2019 మధ్య మొత్తం రూ.718.19 కోట్ల సొత్తు దొంగలపాలైంది. అందులో రూ.319.63 కోట్లనే పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. అంటే తిరిగి రాబట్టగలిగింది 44.50 శాతమే.

ప్రధాన కారణాలివే..

* చాలా సందర్భాల్లో నేరగాళ్లు దోచుకున్న సొత్తును విక్రయించి.. వచ్చిన నగదును ఖర్చు చేస్తుంటారు. విలాసాలకు వెచ్చిస్తారు. దీంతో వారు పోలీసులకు పట్టుబడినా ఆ సొత్తంతా రికవరీ కావట్లేదు.

* కేసును ఛేదించి నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరిగినకొద్దీ.. పోయిన సొత్తు మొత్తం రాబట్టడం కష్టమవుతోంది.

* తక్కువ మొత్తాల్లో సొత్తు పోయిన కేసుల ఛేదనను క్షేత్ర స్థాయిలో పోలీసులు పెద్దగా సీరియస్‌గా తీసుకోవట్లేదు. ఆ కేసుల్లో రికవరీలు చాలా తక్కువగా ఉంటున్నాయి.

* కొందరు బాధితులు వాస్తవంగా పోగొట్టుకున్న నగదు, ఆభరణాల విలువ కంటే ఎక్కువ మొత్తం పోయినట్లు ఫిర్యాదు చేస్తుంటారు. నకిలీ ఆభరణాల్ని నిజమైన వాటిగా చూపిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో నిందితుల్ని పట్టుకున్నా రికవరీ మాత్రం దస్త్రాల్లో పేర్కొన్న స్థాయిలో సాధ్యపడదు.

* కొన్ని సందర్భాల్లో పూర్తి మొత్తం రికవరీ చేసినా.. దస్త్రాల్లో చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

* కంజర్‌భట్‌ తదితర ముఠాలు పెద్ద మొత్తాల్లో సొత్తు కొల్లగొట్టి వారి రాష్ట్రాలకు వెళ్లి పోతుంటాయి. వారిప్రాంతాల్లోకి వెళ్లి ఆ మొత్తాన్ని రికవరీచేయటం సాధ్యపడట్లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This