‘ప్లాస్మా థెరపీతో మరణాలు తగ్గలేదు’

ప్లాస్మా థెరపీ వల్ల కొవిడ్‌-19 మరణాలు తగ్గలేదని ‘భారతీయ వైద్య పరిశోధన మండలి’ (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ స్పష్టం చేశారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌తో కలిసి ఆయన మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

‘ప్లాస్మా థెరపీ వల్ల మరణాలు తగ్గలేదన్న విషయం.. 14 రాష్ట్రాల్లోని 39 ఆసుపత్రుల్లో 469 మంది బాధితులపై నిర్వహించిన అధ్యయనంలో నిర్ధారణ అయింది. రోగ తీవ్రతనూ ఆ థెరపీ నిరోధించడం లేదు. ఇంకా ప్రచురితంకాని ఈ అధ్యయనంపై తోటి శాస్త్రవేత్తల సమీక్ష జరుగుతోంది. అది పూర్తయ్యాక అధ్యయనం అధికారికంగా ప్రచురితమవుతుంది.”

– బలరాం భార్గవ, ఐసీఎంఆర్​ డైరెక్టర్​ జనరల్​

ఆ సమాచారాన్ని టాస్క్‌ఫోర్స్‌, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త పర్యవేక్షక బృందం పరిశీలించి ఆ విధానాన్ని కొనసాగించాలా? లేదా? అన్నది నిర్ణయిస్తాయని ఆయన వెల్లడించారు.

రష్యా వ్యాక్సిన్‌పై దౌత్య వర్గాలతో సంప్రదింపులు

రష్యా వ్యాక్సిన్‌పై ప్రస్తుతం దౌత్య వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు భార్గవ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

‘వ్యాక్సిన్‌ అభివృద్ధిలో రష్యాకు మంచి చరిత్ర ఉంది. అది చాలా ఏళ్ల నుంచి వ్యాక్సిన్లు తయారు చేస్తోంది. కాబట్టి ఈ వ్యాక్సిన్‌ కూడా బాగుండొచ్చని అనుకుంటున్నాం. 76 మంది రోగులపై జరిపిన పరీక్షలకు సంబంధించిన అధ్యయన ఫలితాలను లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురించారు. దాని ప్రకారం అది చక్కని పనితీరు కనబరుస్తూ, మంచి యాంటీబాడీల ఉత్పత్తికి దోహదపడుతున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ల కోసం కేంద్రం ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ ఇప్పుడు భారత్‌, రష్యా దౌత్య వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. 3వ దశ పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు. దాని నిమిత్తం భారత నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాలి. ఒకసారి అది పూర్తయితే మనం వాటిని ప్రారంభించగలుగుతాం’ అని వివరించారు.

మరణాలు అదుపులోనే ఉన్నాయి

ఇతర దేశాల అనుభవాలను తెలుసుకుని మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో లాక్‌డౌన్‌ను శాస్త్రీయంగా అమలు చేయడం వల్ల కేసుల గ్రాఫ్‌.. ఐరోపా దేశాల మాదిరిగా గరిష్ఠానికి చేరిపోకుండా ఒకే తరహాలో ఉంచగలిగామని భార్గవ పేర్కొన్నారు. మన దగ్గర మరణాలు అదుపులో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఒకసారి కరోనా వచ్చినవారికి ఆ వైరస్‌ రెండోసారి సోకే అవకాశం చాలా చాలా తక్కువని స్పష్టంచేశారు. దాని గురించి ఆందోళన చెందాల్సిందేమీ లేదన్నారు. రాజేష్‌ భూషణ్‌ మాట్లాడుతూ- దేశంలో ఆక్సిజన్‌ కొరత లేదని స్పష్టంచేశారు. మొత్తం కొవిడ్‌-19 బాధితుల్లో 6% మందికే ఆక్సిజన్‌ అవసరం ఉంటుందన్నారు.

ఏపీలో మరణాలు తగ్గుతున్న సంకేతం

ప్రస్తుతం తమిళనాడులో కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో మరణాలు తగ్గుతున్న సంకేతం కనిపిస్తోందని భూషణ్‌ చెప్పారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్‌ కేసులు 12.3% ఉన్నాయి. ఇది జాతీయ సగటు 8.4% కంటే ఎక్కువ. కాబట్టి పరీక్షల సంఖ్య పెంచాలని సూచించాం’

– బలరాం భార్గవ, ఐసీఎంఆర్​ డైరెక్టర్​ జనరల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This