కష్టకాలంలో పెట్రో దోపిడి!

చమురు సంస్థల రోజువారీ సమీక్షలో రెండు వారాలుగా పెట్రోలు డీజిల్‌ ధరలకు రెక్కలు మొలుస్తుండటం జనసామాన్యాన్ని దిమ్మెరపరుస్తోంది. ఇరవై నెలలక్రితం 2018 అక్టోబరులో పీపా ముడిచమురు 80 డాలర్ల రేటు పలికిన దశలో, లీటరు పెట్రోలు ధర సుమారు 80 రూపాయలైంది. అప్పట్లో లీటరు డీజిల్‌ రూ.75లోపు. ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ ముడి చమురు 40 డాలర్లకు చేరువలో ఉన్నా, దేశీయంగా పెట్రో ఉత్పత్తులు లీటరుకు రూ.80 స్థాయికి మించిపోవడం వినియోగదారుల్ని హతాశుల్ని చేస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో తమకు వాటిల్లిన నష్టాలు పూడిపోయేదాకా ‘ధరల సవరణ’ కొనసాగుతుందన్న చమురు సంస్థల వివరణ విస్మయపరుస్తోంది! కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో గిరాకీ కుంగి, ముడిచమురు ఉత్పత్తి నియంత్రణపై రష్యా-సౌదీఅరేబియాల మధ్య సమశ్రుతి కుదరక, రెండు దశాబ్దాల కనిష్ఠానికి ధరలు పతనమయ్యాయి.

అంతర్జాతీయ విపణిలో ధరవరలు పడిపోయినప్పుడు దేశంలో పెట్రో రేట్ల సవరణ ఊసెత్తని చమురు సంస్థలు- 82 రోజుల విరామానంతరం జూన్‌ ఏడో తేదీనుంచి సమీక్ష ముసుగులో రోజుకింతని పెంచేస్తున్నాయి. తనవంతుగా ఇటీవల రెండంచెల్లో లీటరు పెట్రోలుపై రూ.13, డీజిలుపై రూ.16 వంతున అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం వడ్డించింది. కర్ణాటక, తమిళనాడు, దిల్లీ, ఝార్ఖండ్‌ ప్రభృత రాష్ట్రాలూ వ్యాట్‌పోటుకు సిద్ధపడేసరికి- చమురు ధరల కుంపట్లు రాజుకున్నాయి. కరోనా సంక్షోభం ముమ్మరించి వ్యాపారాలు సవ్యంగా సాగక, ఉపాధి అవకాశాలు కుంగి, శ్రామికులకు పనులు దొరక్క, వేతనజీవులకు ఆదాయాలు తగ్గి విలవిల్లాడుతున్న స్థితిలో ఈ పెట్రోమంటల ప్రజ్వలనానికి జనజీవనం దుర్భర దుఃఖభాజనమవుతోంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This