కౌలు రైతుల కోసం జై కిసాన్ : పవన్

కౌలు రైతులు, అన్నదాతల కోసం ప్రత్యేకంగా జైకిసాన్‌ కార్యక్రమాన్ని రూపొందిస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు. తుపాన్లు వచ్చినప్పుడు రైతులు నష్టపోకుండా చూడడమే దీని లక్ష్యమని వెల్లడించారు. ఎలా చేస్తే రైతులకు లాభసాటి ధర వస్తుందనే అంశంపై వ్యవసాయ సంఘాలతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. తుపాను ప్రాంతాల్లో 2రోజుల పర్యటనలో భాగంగా పవన్‌కల్యాణ్‌ గురువారం తిరుపతికి వచ్చిన ఆయన… పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ ప్రసంగించారు. వైకాపా నేతలు అధికారాన్ని అజమాయిషీ కోసం, అలంకారప్రాయానికి తీసుకున్నారని ఆరోపించారు. అన్నం పెట్టే రైతన్న కోసం అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క రోజే కేటాయించారని విమర్శించారు.

‘నెల్లూరు, చిత్తూరు, కృష్ణా, కడప జిల్లాల నాయకులతో మాట్లాడి నివర్‌ తుపాను వల్ల ఎంత నష్టమైందో తెలుసుకున్నాం. 17 లక్షల ఎకరాల వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. వాలిపోయిన పంట కోయలేక నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం రూ.5వేలు, 10వేలిచ్చి చేతులు దులుపుకొంటే సరిపోదు. మద్యాన్ని ప్రభుత్వమే అమ్మిస్తోంది. ఇసుక రేవులను వారి సంబంధీకులతోనే నిర్వహిస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా సంపాదించుకుంటున్నప్పుడు రైతులను ఆదుకునేందుకు ఎందుకు ఆలోచిస్తున్నారు? అన్నం పెట్టే రైతుకు రూ.35వేలు ఇవ్వలేరా? ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. క్షేత్ర స్థాయికి పార్టీ నేతలను పంపి ఎంత మేరకు నష్టమైందనే అంచనాల నివేదిక తయారుచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతాం’ అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This