శెభాష్​ అనిపించుకున్నారు- పద్మాలు సాధించారు!

ఇరవైకి పైగా భాషల్లో పాతికవేలకు పైగా పాటలు పాడారామె. ఆమె గానామృతానికి ముగ్ధులుకాని భారతీయుల్లేరు. అందుకే ఉత్తర భారతాన ‘పియ బసంతి’ అయ్యారు. ఆమె పుట్టి పెరిగిన కేరళలో ‘వానంబాడి’ అయ్యారు. తమిళప్రజల హృదయాల్లో ‘చిన్న కుయిల్‌’గా నిలిచిపోయారు. కన్నడిగుల మనసుల్లో కోకిలగా, తెలుగువారికి ‘సంగీత సరస్వతి’గా మారారు. ఆమె కేఎస్​ చిత్ర.

తీయని ఆమె కంఠస్వరం వింటే గంధర్వులు దిగిరావాల్సిందే. తేనెలూరుతూ సాగే ఆ గానానికి ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. కేరళలోని త్రివేండ్రంలో సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టారు చిత్ర. చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ సహా ఇరవై భాషల్లో తన గానామృతాన్ని పంచారు. ఆరు జాతీయ, ఎనిమిది ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను అందుకున్నారు. 2005లో పద్మశ్రీ అవార్డును తీసుకున్నారు. ఏఆర్‌ రెహ్మాన్‌, ఇళయరాజా, కేవీ మహదేవన్‌ వంటి ఎందరో సంగీత దిగ్గజాలతో కలిసి చిత్ర పనిచేశారు. అంతర్జాతీయస్థాయిలో రూపొందించిన ‘జీవితంలో ప్రతి ఒక్కరూ వినాల్సిన వెయ్యిపాటలు’ పట్టికలో ఈమె పాట చోటు దక్కించుకుంది.

“42 ఏళ్ల నా సంగీత ప్రయాణానికి దక్కిన పురస్కారం ‘పద్మభూషణ్‌’. ఎదురుచూడని ఆనందమిది. భగవంతుడికీ, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నా. మన దేశానికి, ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నా. జైౖహింద్‌” అంటూ టిట్టర్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు చిత్ర.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This