చిత్తడవుతున్న రహదారులు.. ప్రమాదాలతో వాహనదారులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వాగులు పొంగి, చెరువులు అలుగులు పారడం వల్ల చాలా చోట్ల రహదారులు ధ్వంసమై… కల్వర్టులు కూలిపోయాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రహదారులు, మరమ్మతులకు గురైన రోడ్ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. కుండపోత వానలతో గుంతలు పడటం, కంకర తేలడం, తారు కొట్టుకుపోవడం వల్ల… వాహనదారులకు ఆ మార్గాల్లో ప్రయాణం నరకాన్ని చూపిస్తోంది. రోడ్లు కొట్టుకుపోయిన చోట తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్లు బురదమయమై రాకపోకలు ఆలస్యమవుతున్నాయి.

నిధులున్నాయి.. పనులేవి?

నారాయణపేట నుంచి దామరగిద్ద వైపు వెళ్లే రోడ్డు నిర్మించకుండానే అసంపూర్తిగా వదిలేశారు. నిత్యం వేలల్లో ఈ రోడ్డుపై వాహనాలు ప్రయాణిస్తుంటాయి. దీన్ని మధ్యలోనే వదిలివేయడం వల్ల వాహనదారులు నరకం చూస్తున్నారు. ధన్వాడ మండలం కిష్టాపూర్ నుంచి మడిగెలమూల తండా, వంగరగట్టు తండా, గోటూరు లాంటి గ్రామాలకు వెళ్లేందుకు 2018 లోనే రోడ్లు మంజూరయ్యాయి. అయినా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. కేవలం కల్వర్టులు నిర్మించి రోడ్డు పనులు వదిలేశారు. ఉట్కూరు మండలం వల్లంపల్లి… జిల్లా కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటీవల కురిసిన వర్షాలకు కల్వర్టు కొట్టుకుపోయి… రెండు రోజులు రాకపోకలు నిలిచిపోయాయి.

అసంపూర్తి పనులు..

నాగర్‌కర్నూల్‌ నుంచి నాగనూలు వెళ్లే దారి అధ్వాన్నంగా మారింది. కొత్తగా వేస్తున్న రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే కంకరపై ప్రయాణం ఇబ్బందికరంగా ఉండగా… తాజాగా కురిసిన వర్షాలకు రోడ్డంతా గుంతలు పడి నరకం కనిపిస్తోంది. ఇక శ్రీపురం వెళ్లే రహదారి పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు తారు కొట్టుకుపోయి… కంకర పైకి తేలింది. రహదారంతా గుంతలమయంగా మారి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కల్వకుర్తి మండలం తుర్కలపల్లి గేట్ మీదుగా తోటపల్లి వరకు ఉన్న ఆరు కిలోమీటర్ల రహదారిపై గోతులు పడ్డాయి. అరగంటలో చేరాల్సిన గమ్యానికి గంట సమయం పడుతోంది. కొత్త రోడ్డు మంజూరైనా పనులు మాత్రం ప్రారంభం కాలేదని స్థానికులు చెబుతున్నారు.

ప్రతిపాధనలు సిద్ధం..!

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 350 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నట్టుగా అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరమ్మతుల కోసం రూ.13 కోట్లు, కొత్త రోడ్లు వేయడానికి రూ.261 కోట్ల ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. 9వేల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారులుంటే…104 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. తాత్కాలిక మరమ్మత్తుల కోసం రూ.3 కోట్లు, కొత్త రోడ్ల కోసం రూ.84 కోట్లు అవసరమవుతాయని అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This