రూ.12 కోట్లకు టోకరా వేసిన నూతన్ నాయుడు?

విశాఖలో దళిత యువకుడికి శిరోముండనం కేసులో నిందితుడైన నూతన్ నాయుడు ఇద్దరికి బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఏకంగా 12 కోట్ల రూపాయలకు టోకరా వేయటంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

విశాఖ జిల్లా రావికమతం ప్రాంతానికి చెందిన నూకరాజు, తెలంగాణలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్​రెడ్డి మిత్రులు. హైదరాబాద్​లో నూకరాజు సీసీ కెమెరాలు, శ్రీకాంత్ రెడ్డి స్థిరాస్తి వ్యాపారం చేసేవారు. లావాదేవీల్లో భాగంగా నూతన్ నాయుడితో వారికి స్నేహం కుదిరింది. ఈ క్రమంలో ఎస్​బీఐ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఈ బ్యాంకులో దక్షిణ భారత రీజియన్ డైరెక్టర్ పోస్టు కోసం శ్రీకాంత్ రెడ్డి 12 కోట్ల రూపాయలు, ఉద్యోగం కోసం నూకరాజు 5 లక్షల రూపాయలు చెల్లించారు. రెండేళ్లు గడిచినా ఉద్యోగాలు రాకపోవటంతో తాము మోసపోయామని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు వెల్లడించారు. అంత భారీగా డబ్బులిచ్చే స్థాయి శ్రీకాంత్​రెడ్డికి ఉందా లేదా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు విశాఖలోని మహారాణిపేట సీఐ సోమశేఖర్ తెలిపారు. నూతన్​నాయుడికి సహకరించిన శశికాంత్ అనే వ్యక్తిపైనా కేసు నమోదు చేశామని చెప్పారు. ఇప్పటికే శిరోముండనం కేసులో అరెస్టై జైల్లో ఉన్న నూతన్ నాయుడుని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. మోసం కేసు కూడా విచారణ చేయాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This