నేడు రైతు సంఘాలతో కేంద్రం 9వ విడత చర్చలు

సాగుచట్టాల రద్దును డిమాండ్ చేస్తూ దిల్లీ సరిహద్దుల్లో పోరుబాట సాగిస్తున్న అన్నదాతలతో కేంద్రం శుక్రవారం తొమ్మిదో విడత చర్చలు జరపనుంది. విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ భేటీయే చివరి సమావేశం కావచ్చన్న వార్తల నేపథ్యంలో చర్చలకు హాజరయ్యేందుకు రైతు సంఘాలు సుముఖత వ్యక్తం చేశాయి. అయితే వ్యవసాయ చట్టాల రద్దు తప్ప తమకు మరేదీ సమ్మతం కాదని తేల్చిచెప్పాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈసారి భేటీలో కేంద్రంతో ఏకాభిప్రాయం కుదురుతుందన్న ఆశలు లేవని కిసాన్ నేతలు అభిప్రాయపడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించే ఉద్దేశం కేంద్రానికి లేదని ఆరోపిస్తున్నారు. తమకు ఎలాంటి కమిటీలు అవసరం లేదని సాగు చట్టాల రద్దు, తమ పంటలకు కనీసమద్దతు ధరనే తాము కోరుతున్నట్లు స్పష్టం చేశారు.

న్యాయస్థానాలు చట్టాలను రద్దు చేయలేవని తెలిసినప్పటికీ కేంద్రం రైతుల మనోభావాలతో ఆటలాడుతోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. సుప్రీం నియమించిన కమిటీలో నుంచి వైదొలగిన భూపీందర్ సింగ్ మాన్ నిర్ణయాన్ని స్వాగతించారు. కమిటీలోని ఇతర సభ్యులు ఆయనను అనుసరించాలన్నారు. డిమాండ్లను నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. జనవరి 26న అమర్ జవాన్ జ్యోతి వద్ద చరిత్రాత్మక దృశ్యం కళ్లకు కడుతుందని చెప్పారు.

రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ ఊరేగింపు వెళ్తాం. అమర్ జవాన్ జ్యోతి వద్ద జెండాను ఎగరవేస్తాం. ఒక వైపు రైతులు… మరోవైపు జవాన్లు. ఇది ఒక చరిత్రాత్మక దృశ్యం అవుతుంది.

-రాకేశ్ టికైత్​, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This