నడిరోడ్డు మీద నెత్తురోడుతున్న బతుకులు!

భారత పౌరులందరికీ రాజ్యాంగం ప్రసాదించిన జీవనహక్కు ఎప్పటి మాదిరిగానే నడిరోడ్ల మీద ఎలా నెత్తురోడుతోందో జాతీయ నేరనమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజా గణాంకాలు కళ్లకు కడుతున్నాయి. నిరుడు దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 37 వేల పైచిలుకు రోడ్డు ప్రమాదాల్లో దాదాపు లక్షా 55 వేల మంది మృత్యువాత పడిన ఘోరం గుండెల్ని పిండేస్తోంది. అతివేగం అనర్థదాయకమని చెవినిల్లు కట్టుకుపోరుతున్నా మొత్తం ప్రమాదాల్లో 60శాతానికి; 86,241మంది మరణానికి కన్నూమిన్నూ కానని వేగమే కారణమని ఎన్‌సీఆర్‌బీ నివేదిక చాటుతోంది. నిర్లక్ష్యపూరితంగా వాహనాలు నడపడం 25.7 శాతం ప్రమాదాలకు, 42,557 మంది అర్ధాంతర చావులకు కారణమైంది.

బహుముఖ కార్యాచరణేది..?

మొత్తం మీద అతివేగం నిర్లక్ష్యం రెండూ మృత్యుపాశాలుగా మారి 85 శాతానికి పైగా ప్రమాదాలకు, వేల కుటుంబాల్లో ఆరని చిచ్చుకు పుణ్యం కట్టుకొన్నాయి. రోడ్డు ప్రమాద మృతుల్లో ఎకాయెకి 65శాతం 18-35 ఏళ్ల మధ్య వయస్కులేనన్న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ- ఈ ఘోరకలి వల్ల ఇండియా ఏటా తన జీడీపీలో 3-5 శాతం కోల్పోతున్నదనీ లోగడ వాపోయారు. దేశీయంగా రహదారి ప్రమాదాల సంఖ్యను 2018నాటికే సగానికి తగ్గించేలా బహుముఖ కార్యాచరణను చేపట్టనున్నట్లు యూపీఏ తొలిజమానాలోనే ప్రకటించిన గడ్కరీ- మొన్న ఫిబ్రవరినాటి స్టాక్‌హోమ్‌ సదస్సులో తన మంత్రిత్వ శాఖ వైఫల్యాల్ని అంగీకరించారు. కేంద్రం పట్టుపట్టి తెచ్చిన మోటారు వాహనాల చట్టం ఇంకా అమలులో బాలారిష్టాల్ని ఎదుర్కొంటూనే ఉంది.

ఎప్పుడెక్కడ ప్రమాదం జరిగినా అతివేగం నిర్లక్ష్యాలపై నెపాన్ని నెట్టేసే హ్రస్వదృష్టి- అసలు మూలకారణాల్ని మరుగుపరచి రహదారులపై నెత్తుటేళ్ల భ్రష్టరికార్డును కొనసాగిస్తోంది. ‘పెద్ద దిక్కును కోల్పోయి ఏటా లక్షల కుటుంబాలు నిస్సహాయంగా వీధిన పడి కుమిలే దయనీయావస్థ ఇంకెంతకాలం?’ అన్న ప్రశ్నకు ఎవరు జవాబుదారీ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This