పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏ అర్హతలుండాలి?

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీ చేయడానికి గ్రామాల్లో చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. పోటీ చేయాలనుకుంటున్న వారికి ఏయే అర్హతలు ఉండాలి? ఎవరు అనర్హులవుతారు? తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ కరదీపిక ప్రచురించింది. అందులోని ప్రధానాంశాలు..

అర్హతలివే..
* అభ్యర్థులు ఏ పంచాయతీ పరిధిలో పోటీ చేయదలిచారో.. అక్కడి ఓటర్ల జాబితాలో వారి పేరు నమోదై ఉండాలి.
* పోటీ చేయదలిచిన అభ్యర్థుల వయసు నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 21 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు.
* ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వారికి రిజర్వు చేసిన స్థానాల్లోనే కాకుండా అన్‌రిజర్వుడు స్థానాల నుంచి పోటీ చేయొచ్చు.
* మహిళా అభ్యర్థులు అదే కేటగిరిలో జనరల్‌ స్థానాల్లోనూ పోటీ చేయొచ్చు.

వీరు అనర్హులు..
* గ్రామసేవకుడు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్‌ సంస్థల ఉద్యోగులు, చట్టాల ద్వారా ఏర్పడిన ఏదైనా సంస్థకు చెందిన పాలక మండలి సభ్యులు అనర్హులు.
* నీతిబాహ్యమైన నేరానికి పాల్పడ్డారని రుజువై, శిక్ష పడినవారు.. ఆ శిక్షా కాలం ముగిసిన తేదీ నుంచి ఐదేళ్లపాటు పోటీకి అనర్హులు.
* పౌర హక్కుల పరిరక్షణ చట్టం-1955 పరిధిలోకి వచ్చే నేరాల్లో శిక్షపడినవారు.
* మతి స్థిమితం లేని వారు, బధిరులు, మూగవారు.
* దివాలాదారుగా న్యాయ నిర్ణయం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి, రుణ విమోచన పొందని దివాలాదారు.
* గ్రామ పంచాయతీ తరఫున లీగల్‌ ప్రాక్టీషనరుగా నియమితుడై పంచాయతీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి.
* గ్రామ పంచాయతీకి ధర్మకర్త హోదాలో కాకుండా వ్యక్తిగతంగా బకాయిపడి ఉన్న వ్యక్తికి దాన్ని చెల్లించాలని నోటీసు జారీ చేసినా ఆ గడువులోగా చెల్లించకపోయినప్పుడు అనర్హుడవుతారు.
* ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నవారు. (1994 ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం అమలు తేదీ నుంచి ఒక సంవత్సరం లోపల జన్మించిన అదనపు శిశువును పరిగణనలోకి తీసుకోకూడదు. ఈ చట్టం అమలు తేదీ నాటికి ఒక వ్యక్తికి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండొచ్చు.)
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఏదైనా స్థానిక సంస్థ ఆధీనంలోని కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తి అవినీతికి పాల్పడి లేదా విశ్వాసఘాత నేరాల కింద తొలగించినట్లయితే ఆ తేదీ నుంచి ఐదేళ్ల కాలపరిమితి వరకూ అనర్హులే.
* గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్టు చేసుకున్న లేదా ఏదైనా పనికి నిర్వహణ ఒప్పందం చేసుకున్న వ్యక్తులు అనర్హులవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This