‘వాక్ స్వాతంత్ర్యం సంపూర్ణ హక్కు కాదు’

రాజ్యాంగంలోని 19వ అధికరణం కింద పేర్కొన్న వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ సంపూర్ణ హక్కు కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సునయన హోలీ అనే మహిళ అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించేందుకు నిరాకరిస్తూ ఈ మేరకు జస్టిస్ ఎస్.ఎస్. శిందే, జస్టిస్ ఎం. ఎస్. కార్నిక్​తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

తన కక్షిదారు వాక్ స్వాతంత్ర్య హక్కుకు భంగం కలుగుతోందని సునయన తరఫు న్యాయవాది చంద్రచూడ్ వాదించారు. ఈ అంశం రాజకీయ రంగు పులుముకొందని, ఆమె చేసే ప్రతి ట్వీట్ పైనా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే వాక్ స్వాతంత్ర్యం సంపూర్ణ హక్కు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. “ఇది ఎలాంటి ఆంక్షలు లేని సంపూర్ణ హక్కు అన్న భావన పౌరుల్లో నెలకొన్నట్లు ఉంది” అని పేర్కొంది.

ఈ కేసులో సునయనను రెండు వారాల పాటు అరెస్టు చేయబోమని ప్రభుత్వం ఇచ్చిన మౌఖిక హామీని ధర్మాసనం ఆమోదించింది. అయితే సంబంధిత పోలీసు స్టేషన్లకు ఆమె వచ్చి, విచారణకు సహకరిస్తేనే ఈ మేరకు ఆమెకు ఈ వెసులుబాటు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ రెండు వారాల్లో పోలీసులు ఏదైనా చర్యకు ఉపక్రమిస్తే కోర్టును ఆశ్రయించవచ్చని సునయనకు ధర్మాసనం సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This