దీపావళి మరింత ప్రత్యేకం.. కొత్త సినిమాలు వస్తున్నాయ్

సరికొత్త చిత్రాలతో ఈ దీపావళి మరింత ప్రత్యేకం కాబోతోంది. ఒకప్పుడు పండగ సెలవులు వస్తే థియేటర్ల వైపు చూసే వాళ్లం. కరోనా వల్ల థియేటర్లు మూతపడటం వల్ల పెద్ద ప్రాజెక్టులను కూడా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో ఇంట్లోనే కూర్చొని ఇష్టమైన సినిమా చూసే వెసులుబాటు లభించింది. ఈ దీపావళికి అక్షయ్‌ కుమార్‌ ‘లక్ష్మి’, సూర్య ‘ఆకాశం నీ హద్దురా!’, కీర్తి సురేశ్‌ ‘మిస్‌ ఇండియా’ తదితర సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. నవంబరులో మనల్ని అలరించడానికి సిద్ధమైన సినిమాల జాబితా చూద్దాం..

మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి వ్యాపార రంగంలో రాణించాలని చిన్నతనం నుంచి కలకంటుంది. ఆర్థిక సమస్యల్ని దాటి.. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. ‘మిస్‌ ఇండియా’ అనే బ్రాండ్‌తో విదేశాల్లో ఛాయ్‌ కంపెనీ పెడుతుంది. ఈ కథాంశంతో వస్తోన్న సినిమా ‘మిస్‌ ఇండియా’. కీర్తి సురేశ్‌ టైటిల్‌ రోల్‌ పోషించారు. నరేంద్రనాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు, నదియా, నరేష్‌, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషించారు. నవంబరు 4న నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా విడుదల కాబోతోంది.

ఎయిర్ దక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపినాథ్‌ జీవితం ఆధారంగా రూపొందించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా!’. సూర్య కథానాయకుడిగా నటించారు. అతి తక్కువ ధరలతో ప్రతి భారతీయుడు విమాన ప్రయాణం చేసే విధంగా ఓ గ్రామానికి చెందిన యువకుడు కనే అసాధ్యమైన కలే ఈ చిత్రం. సుధా కొంగర దర్శకురాలు. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నవంబరు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దక్షిణాదిలో హిట్‌ అందుకున్న ‘కాంచన’ ఉత్తరాదిలోనూ వినోదం పంచడానికి సిద్ధమైంది. ఈ సినిమా రీమేక్‌లో అక్షయ్‌ కుమార్‌ నటించగా.. రాఘవా లారెన్స్‌ తెరకెక్కించారు. మంచి సందేశంతోపాటు వినోదాత్మక కథతో రూపొందిన ఈ చిత్రానికి తొలుత ‘లక్ష్మీ బాంబ్‌’ అనే టైటిల్ పెట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని ‘లక్ష్మీ’గా మార్చారు. ఈ చిత్రం కోసం అక్షయ్‌ తొలిసారి చీరకట్టి.. మహిళ గెటప్‌లో కనిపించారు. నవంబరు 9న డిస్నీ+హాట్‌స్టార్‌లో చిత్రం విడుదల కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This