ప్రేక్షకులకు దక్కిన వరం.. హాస్యలోకానికి ఆయన రారాజు

ప్రతి మనిషి జీవితంలో సుఖదుఃఖాలుంటాయి, ఎత్తుపల్లాలూ ఉంటాయి. వెండితెరమీద నవ్వులు పంచిన వారందరి జీవితాలూ పువ్వుల బాటలు కావు. అందుకు ఆయన జీవితం మినహాయింపు కాదు. ఆయన ఓ అద్భుత హాస్యనటుడు, రంగస్థల నటుడు, గాయకుడు, సంగీత ప్రియుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు. ప్రముఖ సంగీత కళానిధి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన కళారాధకుడు. వెండితెరమీద ఎంతో బిజీ నటుడిగా ఉన్నప్పటికీ నాటకరంగాన్ని విడిచిపెట్టని కళాజీవి. నిర్మాతగా మారి ఎందరో చిన్న కళాకారులకు ఉపాధి కల్పించిన సహృదయుడు. ఆయనే నవ్వులరేడు బసవరాజు పద్మనాభం. నేడు 89వ జయంతి . ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

బాల్యంలో బంగారం…

1931 ఆగస్టు 20న కడప జిల్లా, పులివెందుల తాలూకా,సింహాద్రిపురంలో పుట్టారు. తల్లిదండ్రులు వెంకట శేషయ్య, శాంతమ్మ. కరణీకం తండ్రి వృత్తి. పద్మనాభంకు చిన్నప్పటినుంచీ సంగీతమంటే మక్కువ. ఐదేళ్ల వయసులోనే కపిలవాయి రామనాథ శాస్త్రి, వేమూరి గగ్గయ్య పద్యాలను అనుకరించి పాడుతూ ఉండేవారు. ఆరోజుల్లో సినిమాలు డేరాలు వేసి వేసేవారు. చిన్నతనంలో పద్మనాభం ఆ డేరా హాళ్లలో ద్రౌపదీ వస్త్రాపహరణం, వందేమాతరం, సుమంగళి, భక్త ప్రహ్లాద లాంటి సినిమాలు ఎన్నో చూసి అందులో పాటలూ, పద్యాలూ పాడుతూ ఉండేవారు. వారి ఊళ్లో చింతామణి నాటకం ఆడుతుంటే అందులో బాలకృష్ణుడు వేషం వేశారు. మోటబావిలో బెండ్లు కట్టుకొని ఈతకొడుతూ మునిగిపోతుంటే ఓ స్నేహితుడు రక్షించాడు. ప్రొద్దుటూరు హైస్కూలులో చదువుకుంటూ, చేతిలో చిల్లి గవ్వ లేకుండా సైకిలు కొనాలని మద్రాసు వెళ్లారు. పాటలు, పద్యాలు పాడి డబ్బు సంపాదించి సైకిలు కొనాలని అతడి ఉద్దేశ్యం. అది సాధ్యమా! జెమినీ స్టూడియో వద్ద కన్నాంబ అడ్రసు తెలుసుకొని త్యాగరాయ నగర్ మలానీ వీధిలో హిందీ ప్రచారసభకు దగ్గరలో వున్న ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె పద్మనాభంను చూసి ఎవరు నాయనా అని అడిగితే, మాది ప్రొద్దుటూరు. మీ సినిమా చండిక చాలాసార్లు చూశాను. మీదగ్గర పాటలు పాడి డబ్బు సంపాదించి సైకిలు కొనుక్కుందామని వచ్చాను అని చెప్పడం వల్ల ఆమె ఓ నవ్వు నవ్వి మంచి భోజనం పెట్టింది. ఆమె పద్మనాభం ను రాజరాజేశ్వరి ఆఫీసుకు తీసుకెళ్లి సి.ఎస్.ఆర్, కొచ్చెర్లకోట సత్యనారాయణ, కల్యాణం రఘురామయ్య, దాసరి కోటిరత్నం సమక్షంలో పాటలు, పద్యాలు పాడించింది.

పాదుకా పట్టాభిషేకంలో గుహుడి పాటకు కోరస్ పాడారు పద్మనాభం. మాయాలోకంలో శరబందిరాజు ఏడుగురు కొడుకుల్లో మొదటివాడిగా పద్మనాభం నటించారు. గూడవల్లి రామబ్రహ్మంకు చిన్నచిన్న పనులు చేసిపెడుతూ మద్రాసులోనే పెరిగారు. అప్పుడు పద్మనాభంకు జీతం నెలకు 40 రూపాయలు. పద్మనాభంకు పద్యాన్ని భావయుక్తంగా ఎలా పాడాలో నేర్పిన మహనీయుడు సి.ఎస్.ఆర్. రఘురామయ్య. పద్మనాభం ఆయనకు మాలీషు చేస్తుంటే రఘురామయ్య దీవించేవారు. సి.ఎస్.ఆర్ బృందంలో పద్మనాభం దాదాపు 50కి పైగా నాటకాలు వేశారు. చిన్నవాడుగా ఉండగా అతడు నటించిన రెండో సినిమా నాగయ్య గారి త్యాగయ్య. అందులో త్యాగయ్య శిష్యుని పాత్రకోసం గుండు గీయించుకోవలసి వచ్చింది. తరవాత ముగ్గురు మరాఠీలు సినిమాలో తంతీరావు పాత్రను పోషించారు. అందులో నెలకు జీతం 60రూపాయలు. తర్వాత నారద-నారది, యోగి వేమన, భక్త సిరియాళ వంటి చిత్రాల్లో చిన్నిచిన్న వేషాలు వేశారు. జెమినీ వారి వింధ్యరాణి సినిమాలో పద్మనాభం తనపాట తనే పాడుకున్నారు. 1948లో కొంత గ్యాప్ రాగా పద్మనాభం తన సొంతవూరుకు వెళ్ళిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This