ఈ టాలీవుడ్​ ‘లెక్కల మాస్టర్’​ రూటే సెపరేటు

ప్రేమ.. రెండు గుండెల చప్పుడు. రెండు జీవితాల సంగమం. రెండు కుటుంబాల కలయిక. అపురూపమైన ప్రేమను, అనిర్వచనీయమైన జీవితాన్ని, చిన్ని ఎద పట్టని భావోద్వేగాల్ని తెరకెక్కించగల ఇంటెలిజెంట్‌ డైరెక్టర్‌. ఆయనకు లెక్కలు తెలుసు. లెక్కల్లో ఇమిడిపోగల బతుకులు తెలుసు. అటు గణితాన్ని, ఇటు జీవితాన్ని కలగలిపి కలర్‌ ఫుల్‌గా కళ్లాపి జల్లి తెరపై రంగురంగుల రంగవల్లికలు అద్దగల సృజనశీలి. వన్‌ సైడ్‌ ప్రేమికుల పక్షాన నిలిచి.. వారి హృదయ స్పందనను ‘ఆర్య’గా మలచినా.. బావమరదళ్ల సరస సల్లాపాల్ని 100 పర్సెంట్‌ లవ్‌గా తీర్చిదిద్దినా, మనం మరిచిపోతున్న మన పల్లె సీమల రంగస్థలాన్ని మనముందుకు తెచ్చినా.. ఆ లెక్కల మాస్టారికే చెల్లు. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా తెలుగు సినిమా పరిశ్రమకు సేవలందించిన ఘనత ఆయన సొంతం. ఆయనే ప్రముఖ‌ దర్శకుడు సుకుమార్‌. జనవరి 11న ఈయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..

స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో తూర్పు గోదావరి జిల్లా రాజోలు సమీప మట్టపర్రులో 1970 జనవరి 11న సుకుమార్‌ జన్మించారు. తండ్రి తిరుపతి నాయుడు బియ్యం వ్యాపారి. తల్లి వీరవేణి గృహిణి. ఈ దంపతుల ఆరుగురి సంతానంలో సుకుమార్‌ చిన్నవారు. ఆరు సంవత్సరాల వయస్సులో.. తాను ఎంతగానో ప్రేమించిన కోడి పుంజు చనిపోయిన విషయం తెలుసుకొన్న సుకుమార్‌ అప్పటి నుంచి శాకహారిగా మారారు. రాజోలులో జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో చదివారు. ఆ తర్వాత లెక్కల్లో మాస్టర్స్‌ డిగ్రీ పట్టా పొందారు. కాకినాడలో ఆదిత్య జూనియర్‌ కళాశాలలో మ్యాథ్స్, ఫిజిక్స్‌ లెక్చరర్‌గా పనిచేశారు. ఆరు సంవత్సరాల తర్వాత సృజనాత్మకంగా ఏదైనా చేయాలని తన జూనియర్‌ ప్రకాష్‌ తోలేటితో కలిసి సుకుమార్‌ నిర్ణయించుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This